అమరవీరుల స్తూపం వద్ద సెల్యూట్ చేస్తున్న సీపీ, నివాళులర్పిస్తున్న పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్
గోదావరిఖని(రామగుండం): సమాజ సేవలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు మరువలేనివని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. రామగుండం కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వుడ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆదివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరారు. ప్రజాసేవకులుగా పజల ధన, మాన, ప్రాణాల రక్షణకు పునరంకితం కావాలన్నారు.
ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం వంటి విచ్ఛినకర శక్తులు, నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడాల్సి రావడంతో పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాగా మారిందన్నారు. పోలీసుల తప్పులు ప్రచారం అవుతున్నంతగా వారి త్యాగాలు ఆశించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోవడం లేదన్నారు. త్యాగాలు చేసే వారిని గుర్తించడం లేదన్నారు. ఈ ఏడాది దేశంలో విధి నిర్వహణలో 414 మంది వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని, వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలను కాపాడమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. పోలీసులు చేస్తున్న అత్యున్నత త్యాగాలను సమాజం గుర్తించుకునే విధంగా ప్రముఖ దిన పత్రికలలో ప్రకటనలు బ్యానర్లు, కమిషరేట్‌లో, పోలీస్‌స్టేషన్లలో ఓపెన్‌హౌస్ కార్యక్రమాలు, కొవ్వొత్తి ర్యాలీలు, నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం..
ప్రజల కోసం అసువులు బాసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాల న్యాయం చేస్తామన్నారు. నివాళ్లర్పించడానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సీపీ వివరాలు తెలుసుకున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈసందర్భంగా అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు.
అమరవీరులకు నివాళి..
ప్రజాసేవలో అసువులు బాసిన అమరుల కుటుంబాలకు సీపీ ఘన నివాళి అర్పించారు. స్తూపం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళ్లర్పించారు. వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ టి.సుదర్శన్‌గౌడ్, మంచిర్యాల డీసీపీ ఎం.వేణుగోపాల్‌రావు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ అశోక్‌కుమార్, లాఅండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీలు రక్షిత కె.మూర్తి, బాలుజాదవ్, హబీబ్‌ఖాన్, గౌస్‌బాబా, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఏఆర్, సివిల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment