సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. హోంగార్డుల రెగ్యులరైజేషన్‌పై ముఖ్యమంత్రి ఆలోచన చేశారని.. రెగ్యుల రైజేషన్‌కు అర్హత లేనివారిని హోంగార్డులుగానే కొనసాగించాలా, క్లాస్–4 ఉద్యోగులుగా మార్చాలా అనే అంశాలను చర్చిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం శాసన మండలిలో పోలీసు శాఖ ఆధునికీకరణపై జరిగిన లఘు చర్చలో మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, సుంకరి రాజు, రాములు నాయక్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు నాయిని సమాధానమిచ్చారు.
హోంగార్డుల వేతనాలను కూడా రూ.12 వేలకు పెంచామని గుర్తు చేశారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు చేపడితే కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. ‘ఓవైపు రెగ్యులరైజ్ చేయాలంటూ మరోవైపు కేసులు పెడుతూ అడ్డుకుంటున్నారు.. ఇదేం పద్ధతయ్యా..!’అని విమర్శించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కల్పించుకొని న్యాయం జరగని వారు కోర్టుకు వెళతారని, కోర్టును ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment