'నాయిని నెత్తిన టోపీ.. కేసీఆర్ చేతిలో లాఠీ'
హైదరాబాద్: ఎన్నికల సమయంలో హామీలను ఇచ్చి హోంగార్డులకు, పోలీసులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టోపీ పెట్టారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న హోంగార్డుల అరెస్టు ఘటనలో గాయపడిన కొందరిని ఆయన మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న హోంగార్డులను పోలీసులతో కొట్టించి, బూట్లతో తన్నించి అమానుషంగా అరెస్టులు చేయడం దారుణమన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ అన్ని అధికారాలను తన వద్దే పెట్టుకున్నాడని ఆరోపించారు. హోంమంత్రి నాయిని నెత్తిపై టోపీ పెట్టి, లాఠీ మాత్రం కేసీఆర్ చేతిలో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ధర్నాలు ఉండవని, బంద్‌లు, ఉద్యమాలు, పోలీసుల బూట్ల చప్పుడు, లాఠీ చార్జీలు కనిపించవని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేమిటని ఎద్దేవా చేశారు. ఉన్నతాధికారులకు, నాయకులకు సేవ చేస్తున్న హోంగార్డులపై విచక్షణారహితంగా దాడి చేయడానికి పోలీసులకు, ప్రభుత్వానికి చేతులు ఎలా వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'సీఎం ఇంట్లోనే కొడుకు కేటీఆర్ కు మంత్రి పదవి, కూతురు కవిత ఎంపీగా, మేనల్లుడు హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చినా ఎవరూ అడగలేదు. అడ్డమైన గొడ్డుచాకిరీ చేస్తున్న హోంగార్డుల ఉద్యోగాలు పర్మినెంటు చేయాలంటే మాత్రం తప్పు వచ్చిందా! పోలీసు బూట్లతో తొక్కించి, లాఠీలతో కొట్టేటంత పెద్ద తప్పా’ అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
పోలీసులకు జీతాలు పెంచుతామని, 8 గంటల పనివేళలు ఉంటాయని, వారాంతపు సెలవులు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఏమైనా అమలుచేశారా అని రేవంత్ ప్రశ్నించారు. ఇంకా హక్కులకోసం కాళ్లు పట్టుకోకుండా సీఎం కేసీఆర్ నడిచే దారిలో ట్రాఫిక్ సిగ్నళ్లను తీసేసి, ట్రాఫిక్‌ను జామ్ చేయాలని పిలుపునిచ్చారు. హోంగార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రేవంత్ హెచ్చరించారు.