ముఖ్యులు... బంధువులు | Competition in the TRS for the position of District Parishad Chairman is serious | Sakshi
Sakshi News home page

ముఖ్యులు... బంధువులు

Published Thu, Apr 25 2019 3:37 AM | Last Updated on Thu, Apr 25 2019 4:54 AM

Competition in the TRS for the position of District Parishad Chairman is serious - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల కోసం టీఆర్‌ఎస్‌లో పోటీ తీవ్రంగా ఉంది. పలువురు సీనియర్‌ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. అనుకూల రిజర్వేషన్లున్న చోట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. జెడ్పీటీసీలుగా పోటీలోకి దిగుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎమ్మెల్యేలకు, నియోజక వర్గ ఇన్‌చార్జీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జులు జెడ్పీ చైర్మన్‌ పదవే లక్ష్యంగా బీ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు తమ ఇంట్లోని వారినే జెడ్పీటీసీలుగా పోటీ చేయిస్తున్నారు. జెడ్పీ చైర్మన్‌ పదవి రాకున్నా.. నియోజకవర్గంలో తమ తరఫున పార్టీ వ్యవహారాలను చక్కబెడతారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని తెలుస్తోంది.

మరికొందరు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు అధిష్టానం ఆమోదంతో జెడ్పీటీసీలుగా పోటీలోకి దిగుతున్నారు. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి పని చేస్తున్న వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వారికి టీఆర్‌ఎస్‌ అధిష్టానం కొన్ని చోట్ల అవకాశం కల్పిస్తోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు బలంగా ఉన్న స్థానాల్లోని టీఆర్‌ఎస్‌ నేతలకు అధికారికంగా పదవి ఇచ్చి అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగానూ వ్యూహం అమలు చేస్తోంది. పరిషత్‌ ఎన్నికల్లో తొలిదశ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పలువురు ముఖ్యులు జెడ్పీ చైర్మన్‌ పదవి కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జెడ్పీటీసీలుగా పోటీ చేస్తున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు అవకాశం ఇస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు.

వీరిద్దరూ 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఓడారు. దీంతో వీరికి మళ్లీ అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధినేత నిర్ణయించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చైర్‌పర్సన్‌ తుల ఉమకు ఈసారి జగిత్యాల జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ అధిష్టానం అవకాశమివ్వాలని భావిస్తోంది. తుల ఉమ కథలాపూర్‌లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  నల్లగొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బండ నరేందర్‌రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్‌ ఆయనకు చెప్పినట్లు తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్‌ పదవిని ఎలిమినేటి సందీప్‌రెడ్డికి, సూర్యాపేట జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా కోదాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కె.శశిధర్‌రెడ్డి భార్యకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం యోచిస్తోంది. అయితే వీరిద్దరూ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి లింగాల కమల్‌రాజ్‌కు దక్కే అవకాశం కనిపిస్తోంది.

కమల్‌రాజ్‌ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరో నేత మట్టా దయానంద్‌ సైతం ఈ పదవిని ఆశించారు. అయితే జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు గ్రామీణ ప్రాంతంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే అవకాశం రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోసం మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెలే కోరం కనకయ్య టేకులపల్లి జెడ్పీటీసీగా నామినేషన్‌ దాఖలు చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జెడ్పీ చైర్మన్‌ పదవే లక్ష్యంగా జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌కు రెండోసారి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న పట్నం సునీతా మహేందర్‌రెడ్డికి ఈ సారి వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ అధిష్టానం అవకాశం కల్పిస్తోంది.

సునీతా మహేందర్‌రెడ్డి ప్రస్తుతం తాండూరు నియోజకవర్గం కోట్‌పల్లి జెడ్పీటీసీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సునీతారెడ్డి భర్త పట్నం మహేందర్‌రెడ్డి గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి సైతం ఈసారి జనరల్‌ మహిళకు రిజర్వు అయ్యింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనిత ఈ పదవే లక్ష్యంగా మహేశ్వరం జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటు పట్నం మహేందర్‌రెడ్డి అన్న కుమారుడు పట్నం అవినాశ్‌రెడ్డి రంగారెడ్డి జెడ్పీ పరిధిలోని షాబాద్‌ జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

రంగారెడ్డి జిల్లా జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు.  మేడ్చల్‌ జెడ్పీ చైర్మన్‌ పదవి కోసం కీలక నేతల బంధువులు పోటీలోకి దిగారు. మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు ఎం.శ్రీనివాస్‌రెడ్డి మూడుచింతలపల్లి మండలం జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. ఎం.శ్రీనివాస్‌రెడ్డి భార్య సైతం ఇదే స్థానంలో నామినేషన్‌ దాఖలు చేశారు. మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి కుమారుడు శరత్‌చంద్రారెడ్డి ఘట్‌కేసర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా జెడ్పీ చైర్మన్‌ పదవి లక్ష్యంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి జ్యోతి నామినేషన దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భూపా లపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని శాయంపేట జెడ్పీటీసీగా జ్యోతి పోటీ చేయనున్నారు. 

మహబూబ్‌నగర్‌లో సుధాకర్‌రెడ్డికి..  
మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి మాజీ ఎమ్మెల్యే స్వర్ణా సుధాకర్‌రెడ్డికి దక్కే అవకాశాలున్నాయి. భూత్పూరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థి గా ఆయన బుధవారం నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి్డ  పాల్గొన్నారు. దీంతో ఆయనకీ పదవిని ఖాయం చేసినట్లు తెలుస్తోంది.

నిజామాబాద్‌లో ఎవరికో..
నిజామాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ పదవిని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దాదన్న గారి విఠల్‌రావుకు కేటాయించే అవకాశముంది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కొడుకు జగన్‌ చైర్మన్‌ పదవే లక్ష్యంగా ధర్పల్లి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు.్ల స్పీకర్‌ పోచారం కుమారుడు సురేందర్‌రెడ్డి చైర్మన్‌ పదవిని ఆశిస్తూ కోటగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతు న్నారు. కామారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా.. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు భార్యకు అవకాశం ఇచ్చే అంశాన్ని టీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది.  

మంచిర్యాలలో ఓదేలు సతీమణికి..A
మంచిర్యాల జెడ్పీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే నల్లా ల ఓదెలు భార్య భాగ్యలక్ష్మికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. ఆదిలాబా ద్‌ జెడ్పీ చైర్మన్‌గా అనిల్‌జాదవ్‌కు అవకాశం ఇవ్వా లని నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జెడ్పీ చైర్మన్‌ శోభారాణికి నిర్మల్‌ జెడ్పీ చైర్మన్‌గా అవకాశమివ్వాలని పార్టీ భావిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement