హెల్త్‌కార్డుల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి
టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు
పరిగి: ప్రభుత్వం ఉపాధ్యాయుల హెల్త్ కార్డుల అమలుకు వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని తెలంగాణా టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు అన్నారు. ఆదివారం పరిగిలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మదనాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా ప్రధాన కార్యదర్శి చెర్క సత్తయ్య ఏడాది కాలంగా జిల్లాలో ఆ సంఘం నిర్వహించిన కార్యక్రమాలు, భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలకు సంబంధించిన నివేదిక సమర్పించారు. సభ్యులందరూ దానికి ఆమోద ముద్ర వేశారు.
ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఉంచిన హెల్త్‌కార్డులు పట్టుకుని ఉపాధ్యాయులు ఏ ఆస్పత్రికి వైద్యానికి వెళ్లినా నిరాకరిస్తున్నారని తెలిపారు. కేజీటూ పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదన్నారు. ప్రభుత్వం తెలంగాణాలో కామన్‌స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం అమలు చేయాలన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తయారు చేయాలన్నారు.
ఇదే సమయంలో పాఠశాలల్లో రేషనలైజేషన్ విధానం అమలు చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. ‘మన ఊరు -మనబడి‘ అనే నినాదంలో బడులను బాగు చేసే కార్యక్రమం ఓ ఉద్యమంలా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు సత్తయ్య, ప్రకాష్‌రావ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు ధశరథ్‌నాయక్, నజీర్, భీమయ్య, భాగ్యమ్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మదనాచారి, ఉపాధ్యక్షులుగా నజీర్, దశరథ్, హనుమాండ్లు, ప్రధాన కార్యదర్శి నర్సింహ్మామూర్తి, కార్యదర్శులుగా భీమప్ప, భాగ్యమ్మ, సుధాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా భీమయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.