‘‘ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ...
ఆర్మూర్: ‘‘ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను చంద్రబాబే ప్రవేశ పెట్టారు. ఉద్యోగ భద్రత లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కాం ట్రాక్టు ఉద్యోగి అన్న పదమే ఉండదు. అందరి నీ పర్మినెంట్ చేసేస్తాం’’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజులలో, శాసనసభ ఎన్నికల సందర్భం గా ప్రతీ బహిరంగ సభలో కేసీఆర్ చెప్పిన మా టలు ఇవి.
ఏ ప్రసంగంలోనూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అంటూ ప్రస్తావించలేదు. దీంతో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయన్న ఆశతో ప్రతీ కాంట్రాక్టు ఉద్యోగి కుటుం బం ఆ పార్టీకే ఓటు వేసింది. సోమవారం అ సెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యా ఖ్యలు తెలంగాణ పది జిల్లాలలో ఉన్న కాంట్రా క్టు ఉద్యోగుల గుండెలలో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
రెండు రోజులు మౌనంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులంతా తాము మోసపోయామని నిర్ధారణకు వచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వా నికి వ్యతి రేకంగా ఉద్యమ బాట పట్టడానికి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తెలంగాణ సర్వశిక్ష అభియాన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులు గురువారం ఎంఈ ఓ కార్యాలయాలకు తాళాలు వేసి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు ప్రాజెక్టుల పరిధిలో వేల సంఖ్యలో ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరి ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారు అన్న అంశంపై కేసీఆర్ కానీ, టీఆర్‌ఎస్ నాయకులు కానీ మూడు రోజుల క్రితం వరకు స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. ముఖ్యమ ంత్రి ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రాజెక్టులలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
రాజీవ్ విద్యామిషన్, అం గ న్‌వాడీ, ఉపాధి హామీ పథకం, సాక్షరభారతి లాంటి పథకాలలో వేల సంఖ్యలో ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉపాధి హామీ ఉద్యోగులు, ఐకేపీ కాంట్రాక్టు ఉద్యోగుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ మాట్లాడక పోవడంతో వారు ఇక తమ ఉద్యోగాలు పర్మినెంట్ అయినట్లేనంటూ ఆశావహ దృక్పథంతో ఉన్నారు.
అప్పుడు అలా చెప్పి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే ‘కేజీ టు పీజీ’ ఉచిత నిర్బంధ విధ్యను అమలు చేయాలన్నదే తన ప్రధాన సంకల్పమని కేసీఆర్ ఇప్పటికే పలు మార్లు ప్రకటించారు. ఇందులో నిజామాబాద్ జిల్లా ఆర్‌వీఎం పరిధిలో బాధ్యతలు నిర్వహించే సుమారు 650 మంది కాంట్రాక్టు ఉద్యోగులది కీలక పాత్ర.
ఈ పథకంలో 42 మంది ఇన్‌క్లూసివ్ ఎడ్యూకేషన్ రిసోర్స్ టీచర్స్ (ఐఈఆర్‌ఎటీ), 232 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్‌పీ), 36 ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డివిజనల్ లెవల్ మానిటరింగ్ టీం, 36 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఆడిటర్లు, 36 మంది మెసెంజర్లు, 239 మంది కస్తూర్బా బాలికల పాఠశాలలలో (కేజీబీవీ) కాంట్రాక్టు రిసోర్స్ టీచర్స్, ఆడిటర్లుగా పని చేస్తున్నారు. ఐసీడీఎస్ పరిధిలో అంగన్‌వాడి కార్యకర్తలు, ఆయాలు సుమారు మూడు వేల మందికి పైగా ఉన్నారు. సాక్షరభారతిలో వందల సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రెండు రోజులలో కార్యాచరణ
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ఇక తమ ఉద్యోగాలు పర్మినెంట్ కావనే భావనతో తెలంగాణ సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ‘చలో హైదరాబాద్’ పేరిట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంగన్‌వాడీ సిబ్బంది సైతం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రెండు రోజులలో కార్యాచరణ రూపొందించుకుంటామని యూనియన్ నాయకులు తెలిపారు.