ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే ఆందోళన
సంగారెడ్డి అర్బన్: కేంద్ర ప్రభుత్వం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుపెట్టడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టడమేనని, కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోని పక్షంలో పెద్ద యెత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి హెచ్చరించారు.
సోమవారం కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో డొమెస్టిక్ టర్మినల్‌కు ఎన్‌టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సునీతాలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల మధ్య చిచ్చును రగిల్చేలా ఉందన్నారు. రాష్ట్ర శాసన సభకు, ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి పనుల గురించి ఆలోచిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ వత్తిడితో కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
రాజీవ్‌గాంధీ పేరును పునరుద్ధరించాలని లేని పక్షంలో భవిష్యత్ కార్యచరణ రూపొందించి ముందుకెళ్తామన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకార్యకర్తలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏకపక్ష నిర్ణయాలను మానుకొని ఇరురాష్ట్రాల ప్రజలు స్నేహపూర్వక వాతావరణంలో మెలిగేలా సహకరించాలన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ బొజ్జాను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి సుప్రభాతరావు, మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, డిసీసీ కార్యదర్శి శంకర్‌యాదవ్, డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, శివరాజ్‌పాటిల్, జెడ్పీటీసీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.