అ‘భయం’ | Concern on the women's self-help groups on abhayahastham scheme | Sakshi
Sakshi News home page

అ‘భయం’

Published Sat, Nov 15 2014 4:48 AM | Last Updated on Sat, Aug 25 2018 4:02 PM

Concern on the women's self-help groups on abhayahastham scheme

పథకం కొనసాగుతుందా..?
* ఆందోళన చెందుతున్న పింఛన్‌దారులు
* ఈ నెల నిధులు నిలిపేసిన సర్కారు
* ఆసరా పథకం వర్తింపజేయాలని విజ్ఞప్తి

నల్లగొండ : అభయహస్తం పథకం అమలుపై మహిళా స్వయంసహాయక సంఘాల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆసరా’తో పింఛన్ పెరుగుతుందని ఆశించిన అభయహస్తం పింఛన్‌దారులకు నిరాశే ఎదురైంది.

నవంబర్ నెలకు చెల్లించాల్సిన అభయహస్తం పింఛన్ సొమ్మును కూడా ప్రభుత్వం నిలిపేసింది. దీంతో పాటు సంఘాల్లోని సభ్యుల్లో 9, 10, ఇంటర్, ఐటీఐ చదివే పిల్లలకు చెల్లించే ఉపకార వేతనాలు కూడా ఆగిపోయాయి. అదీగాక కొంతకాలంగా ఈ పథకం అమలుతీరు గురించి రాష్ట్రస్థాయిలోనే ఎలాంటి సమీక్షలూ నిర్వహించలేదంటే ప్రభుత్వ ఆలోచన ఏమైఉంటుందనేది కూడా జిల్లా అధికారులకు అంతుచిక్కడం లేదు.
 
లబ్ధిదారుల్లో ఉత్కంఠ....
మహిళలకు చేయూతనివ్వాలని, వారికి ఆర్థికస్వావలంబన కల్పించాలన్న ఉద్దేశంతో వైఎస్.రాజశేఖరరెడ్డి  2009లో అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. అదే సంవత్సరం నవంబర్ 1 నుంచి అభయహస్తం పింఛన్ కింద అర్హులైన వారికి నెలకు 500 రూపాయల చొప్పున చెల్లించారు. ఇలా జిల్లాలో 26,354 మంది మహిళలు ఈ పెన్షన్ పొందుతున్నారు. 60 ఏళ్లు నిండిన వారు ఈ పథకంలో పెన్షన్ పొందేందుకు అర్హులు. అదే సామాజిక భద్రత పెన్షన్లు  65 ఏళ్లు నిండిన వారికి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు.

పాత పద్ధతి ప్రకారం సామాజిక పింఛన్లు రూ.200 చెల్లిస్తున్నప్పుడు..అభయహస్తం పింఛన్ రూ.500లు చెల్లించారు. ఈ ప్రభుత్వం సామాజిక పింఛన్లు రెండు వందల నుంచి వెయ్యికి పెంచింది కానీ అభయహస్తం పింఛన్‌దారులకు దానిని వర్తింపజేయలేదు. అయితే అభయహస్తంలో పెన్షన్ పొందుతున్న వారిలో 65 ఏళ్లు నిండిన వారు ‘ఆసరా’కు  దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు మౌఖికంగా సంఘాలకు చెప్పాయి. కానీ ఆచరణలో అది ఎంతవరకు సక్సెస్ అయ్యిందన్న  సమాచారం లేదు.
 
పెన్షన్ నిధిపై సందేహాలు...
అభయహస్తం పెన్షన్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మహిళలు డబ్బులు జమచేశారు. మొత్తం 60వేల సంఘాల్లో 24,105 సంఘాలు అభయహస్తంలో చేరాయి. ఈ సంఘాల్లో మొత్తం 2 లక్షల 77 వేల మంది సభ్యులు ఉన్నారు.  ఐదేళ్ల నుంచి ప్రతి ఏడాది 365 రూపాయల చొప్పున సెర్ప్‌కు చెల్లిస్తున్నారు. సభ్యులు తమ వాటాధనం కింద రూ.365లు చెల్లిస్తే...ప్రభుత్వ మరో వాటా రూ.365లు అదనంగా జమ చేస్తుంది.

ఈ మొత్తం నగదు అంతా సెర్ప్ నుంచి ఎల్‌ఐసీకి చేరుతుంది. ఇలా ఇప్పటివరకు 5 కోట్ల 55 లక్షల 25 వేల రూపాయలు పెన్షన్ నిధికి జమ చేశారు.  ఇలా జమచేస్తే వృద్ధాప్యంలో తమకు అదనంగా పెన్షన్ వస్తుందని పైసాపైసా కూడబెట్టుకుని అభయహస్తం వాటా ధనం చెల్లిస్తున్నారు. అయితే ఇప్పుడు పెన్షన్‌లో ఈ విషయమై అధికారులను అడిగితే... తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని, తామేమీ చేయలేమని చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
 
పింఛన్ ఇంకా ఇవ్వలేదు..
నేను మూడేళ్ల క్రితం అభయహస్తం పథకంలో చేరి రూ.3700 చెల్లించా. నాకు 60 ఏండ్లు నిండిన తరువాత నెలకు రూ.500 పింఛన్ వస్తుందని చెప్పారు. అన్నట్లుగా నాకు గత ఏడాదిన్నర క్రితం 60 ఏండ్లు నిండడతో ప్రతి నెలా రూ.500 పింఛన్ వచ్చేది. కానీ ఈ నెల ఇంకా ఇవ్వలేదు. ఎందుకు వస్తలేదో ఎవరూ చెప్పడం లేదు. గ్రామ పంచాయతీ వారు త్వరలో లిస్టు పెడుతారంటా, అందులో పేరు ఉంటే ఇస్తామంటున్నారు. వారు ఇంకా లిస్టు పెట్టలేదు.
 - కరాట్ని లక్ష్మమ్మ, మునుగోడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement