హైదరాబాద్: మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు నెమ్మదిగా కోలుకుంటున్నారు. 20 మంది విద్యార్థుల్లో 16 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉండగా, నలుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే 12 మంది విద్యార్థులను సాధారణ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయిరాం, రుచితగౌడ్, సాత్విక, నబిరా ఫాతిమా, మహిపాల్‌రెడ్డి, సద్భావన్ దాస్, దర్శన్, కరుణాకర్, హరీష్, అభినందు, సందీప్, శిరీష, శివకుమార్, నితూషల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా ప్రశాంత్, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా, మూడు రోజుల క్రితం గాయపడ్డ విద్యార్థులను ఐసీయూ, ఏఎన్‌సీయూ, ఎస్‌ఐసీయూ వార్డుల్లో ఉంచడంతో తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని కన్నవారు తీవ్ర ఆందోళ చెందుతున్నారు.
ఆదివారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో విద్యార్థులను మెదక్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శరత్ పరామర్శించారు. 20 మందిలో 16 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వారికి ప్రభుత్వ ఖర్చులతో పూర్తిస్థాయి చికిత్స అందిస్తామన్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు డిశ్చార్జ్ సమయంలో ప్రభుత్వం నుంచి రూ. లక్షను అందిస్తామని, అలాగే రైల్వేశాఖ నుంచి రూ. లక్ష పరిహారం అందుతుని తెలిపారు.స్కూల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఆ ప్రమాదంపై సబ్‌డివిజన్ మెజిస్ట్రేట్ అధికారితో విచారణ జరుపుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. కాకతీయ స్కూల్లోని మిగతా విద్యార్థులను వారి పేరెంట్స్ కోరితే స్థానిక పాఠశాలలో చేర్చుతామన్నారు.