రుణ మాఫిపై షరతులు సరికాదు: బీజేపీ
హైదరాబాద్: ఎలాంటి షరతులు, పరిమితులు లేకుండా రైతుల రుణాలను మాఫీ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేఎల్‌పీ ఉప నేత చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధుల బృందం గురువారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో భేటీ అయింది. 2013-14 పంట రుణాలనే మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినట్టు వస్తున్న వార్తలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.
ఇలా మాట మార్చడం భావ్యం కాదని, తెలంగాణ రైతుల ఆశలు ఆవిరయ్యేలా చేయొద్దని కోరారు. సహకార, వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రకాల రుణాలనూ మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో పుస్తకాన్ని మంత్రికి చూపుతూ, దానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని కోరారు.
రైతులందరికీ రూ.లక్ష వరకు ఉన్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను మాఫీ చేయాలని, కౌలు రైతులు తీసుకున్న రుణాలకూ దీన్ని వర్తింపజేయాలని, కాలవ్యవధి, షరతులు పెట్టొదని వినతిపత్రం అందజేశారు. నిరుటి రుణాలకే మాఫీ అన్న వార్త నిజం కాదని పోచారం పేర్కొన్నట్టు భేటీ అనంతరం నేతలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, మల్లారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచారి, నేతలు మధుసూదన్‌రెడ్డి, పాపయ్యగౌడ్, నర్సింహారెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.