గురుకులాల్లో కాస్మొటిక్‌ కిట్లపై అయోమయం | Confused with cosmetic kits in gurukuls | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో కాస్మొటిక్‌ కిట్లపై అయోమయం

Published Fri, Jul 6 2018 1:03 AM | Last Updated on Fri, Jul 6 2018 1:03 AM

Confused with cosmetic kits in gurukuls

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినులకు అందిస్తున్న కాస్మొటిక్‌ కిట్లపై అయోమయం నెలకొంది. కిట్లలోని వస్తువుల ధరలు భారీగా పెరగడంతో వాటిని కొనుగోలు చేసి పంపిణీ చేయడం సొసైటీలకు తలకు మించిన భారంగా మారుతోంది. దీనిపై తర్జనభర్జన నెలకొనడంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా కిట్ల పంపిణీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి చొప్పున ఏడాదిలో నాలుగుసార్లు వాటిని విద్యార్థినులకు అందించాల్సి ఉంది. ఈసారి ఇంకా అందించకపోవడంతో పలువురు విద్యార్థినులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకోవల్సి వస్తోంది.

కిట్లకు ధరాభారం..
గత విద్యాసంవత్సరం చివర్లో గురుకుల సొసైటీలు విద్యార్థినుల కోసం ప్రయోగాత్మకంగా కాస్మొటిక్‌ కిట్లను పంపిణీ చేశాయి. కాస్మొటిక్‌ కేటగిరీలో ఉండే వస్తువులను వేర్వేరుగా కొనుగోలు చేసిన సొసైటీలు... కిట్లుగా మార్చి విద్యార్థినులకు అందించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల్లోని సగానికిపైగా గురుకులాలకు ఈ కిట్లను సరఫరా చేశారు. అయితే సరుకుల కొనుగోలుకు, ప్రభుత్వం ఇచ్చే చార్జీలకు భారీ వ్యత్యాసం ఉండటంతో కిట్లను పంపిణీ చేయడం గురుకుల సొసైటీలకు భారంగా మారింది.

మరోవైపు మైనారిటీ గురుకులాల్లో ఇస్తున్న చార్జీలు... ఇతర గురుకుల సొసైటీల్లో ఖర్చు చేసే మొత్తంలో కూడా భారీ తేడా ఉంటోంది. మైనారిటీ గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థినికి ఇచ్చే కిట్‌ను రూ. 300 పెట్టి కొనుగోలు చేస్తుండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీలు ఇందుకోసం రూ. 160 చొప్పున మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. దీంతో మైనారిటీ గురుకులాల్లో అత్యుత్తమ కిట్లు అందుతుండగా మిగతా గురుకులాల్లో కిట్ల నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటోంది. ఫలితంగా వాటిని విద్యార్థినులు పెద్దగా ఇష్టపడటం లేదు.

ఈ నేపథ్యంలో విద్యార్థినులకు ఇచ్చే కాస్మొటిక్‌ కిట్లను ఒకే సంస్థ ద్వారా పంపిణీ చేయించాలని గురుకుల సొసైటీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కిట్ల పంపిణీని కేంద్రీకరించాలని కోరుతూ ప్రతిపాదనలు తయారు చేశాయి. కిట్‌లో ఉండే వస్తువుల జాబితాను పేర్కొంటూ వాటిని నేరుగా గురుకులాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీలు ప్రభుత్వాన్ని కోరాయి. దీని అమలు సాధ్యాసాధ్యాలపై వచ్చిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది . వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాక గురుకులాలకు కిట్లను పంపిణీ చేయనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement