ముందు నెగిటివ్‌.. ఆ తర్వాత పాజిటివ్‌ రిపోర్టు | Confused on COVID 19 Tests in Gandhi Hospital Hyderabad | Sakshi
Sakshi News home page

ఎట్టెట్టా? ఇదెట్టా!

Published Sat, Apr 18 2020 8:21 AM | Last Updated on Sat, Apr 18 2020 8:21 AM

Confused on COVID 19 Tests in Gandhi Hospital Hyderabad - Sakshi

పాతబస్తీకి చెందిన ఓ మహిళ (27) కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ ఇటీవల కింగ్‌కోఠి ఆస్పత్రిలో చేరింది. వారం రోజుల క్రితం వైద్యులు ఆమె నుంచి నమూనాలు సేకరించి ఉస్మానియా మెడికల్‌ కాలేజీలోని వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రానికి పంపారు. నమూనాలు పంపి వారం రోజులైనా రిపోర్ట్‌ రాకపోవడంతో నాలుగు రోజుల క్రితం మళ్లీ ఆమె నుంచి సేకరించిన రెండో నమూనాలను అదే ల్యాబ్‌కు పంపారు. 12వ తేదీన తొలి నమూనాలకు సంబంధించిన రిపోర్ట్‌ వచ్చింది. నెగిటివ్‌ అని రావడంతో 13వ తేదీన ఆమెను ఇంటికి పంపారు. ఆ తర్వాత 14వ తేదీన రెండు రెండో శాంపిల్‌కు సంబంధించిన రిపోర్ట్‌ వచ్చింది. దీంట్లో పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను మళ్లీ ఆస్పత్రికి రప్పించి అడ్మిట్‌ చేయాల్సి వచ్చింది.  

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాలు గందరగోళంగా మారాయి. ఒకే రోగికి ఒకసారి పాజిటివ్, మరోసారి నెగిటివ్‌ రిపోర్టులు వస్తుండటం విస్మయంకలిగిస్తోంది. ఈ అంశం వైద్య వర్గాల్లోనే కాదు కుటుంబ సభ్యుల్లోనూ తీవ్ర ఆందోళనకుకారణమవుతోంది. రిపోర్టులు పక్కాగా రాకపోతే బాధితుల్లో మరింత భయంనెలకొనే ప్రమాదం ఉంది. మరోవైపురిపోర్టుల రాకలో కూడా తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది.

ప్రస్తుతం నగరంలో గాంధీ వైరాలజీ ల్యాబ్‌ సహా, సీసీఎంబీ, ఫీవర్, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్, నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ సహా పలు ఆస్పత్రుల్లో కరోనా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు సగటున ఒక్కో సెంటర్‌ లో 100 శాంపిల్స్‌ను టెస్ట్‌ చేస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని ల్యాబోరేటరీలు లేకపోవడంతో టెస్టుల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రిపోర్ట్‌లో ఏ మాత్రం అనుమానం వచ్చిన కచ్చితత్వం కోసం రెండో సారి నమూనాలు సేకరించి మరో సారి నిర్థారణ పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. తొలి సారి పంపిన శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్ట్‌ మూడు నాలుగు రోజులైనా రాక పోవడంతో రెండో సారి నమూనాలు సేకరించి పంపుతున్నారు. తీరా రెండోసారి నమూనాలు సేకరించి పంపిన తర్వాత తొలి శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్ట్‌ వస్తుంది. దీంటో నెగిటివ్‌ అని తేలడంతో వైద్యులు వారిని ఐసోలేషన్‌ సెంటర్‌ నుంచి ఇంటికి పంపుతున్నారు. తీరా వారు ఇంటి కి చేరుకున్న తర్వాత రెండో శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్ట్‌ వస్తుంది. దీంట్లో పాజిటివ్‌ అని ఉండటంతో మళ్లీ వారిని వెనక్కి రప్పిస్తుండటం ఇటు రోగులకే కాకుండా అటు వైద్యులకు కూడా ఇబ్బందిగా మారింది.

అదనంగా రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది
ఇప్పటికే కరోనా పాజిటివ్‌ కేసులకు సన్నిహితంగా మెలిగిన వారితో పాటు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని ఫీవర్, ఉస్మానియా, సరోజినిదేవి, నేచర్‌క్యూర్, యునానీ, ఆయుర్వేద, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డులకు తరలిస్తున్నారు. ఒక్కో వా ర్డులో 20 నుంచి 30 మందిని ఉంచుతున్నారు. ఐసోలేషన్‌ సెంటర్లలో ఉంటున్న వారి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపుతున్నారు. నిజానికి 12 గంటల్లోనే రిపోర్టు లు రావాల్సి ఉంది కానీ చాలా శాంపిల్స్‌కు రెండు మూడు రోజుల సమయం పడుతుంది.

దీంతో ఐసోలేషన్‌ సెంటర్లలో ఒక్కో అనుమానితుడు అదనంగా రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది. వేర్వేరుగా పడకలు ఉన్నప్పటికీ..అందరికీ కలిపి కామన్‌గా ఒకే బాత్‌రూమ్‌ ఉండటం, ఒకరు వాడిన తర్వాత మరోకరు వీటిని వాడటం వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరి ంచే అవకాశం ఉంది. అంతే కాదు 20 మందికి పైగా ఒకే వార్డులో మూడు నాలుగు రోజులు ఉం డటం వల్ల..వీరిలో ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా మిగిలిన వారందరికీ అంటుకునే ప్రమాదం లేకపో లే దు. ఇటీవల ఉస్మానియా ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో వైద్యులపై జరిగిన దాడికి ఇది కూడా ఓ కారణం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement