
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్, 6వ రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఐదు ప్రగతి వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, ఉత్సాహపూరిత వాతావరణంలో ఆరో వసంతంలోకి అడుగుపెడుతోందని అన్నారు. అపూర్వ మహోద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రం అయినా అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు.
అత్యంత కీలకమైన తొలి ఐదు సంవత్సరాల కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన, సరైన అడుగులు పడ్డాయని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శవంతమైన పాలన అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తోన్న ప్రయత్నాలలో ప్రజలు భాగస్వాములు కావాలని అభిలషించారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం తమ ప్రాణాలను బలిపెట్టిన అమరవీరులకు హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు వెల్లడించారు.