సాక్షి, మంగపేట: మీ కుంటుంబ ఆడబిడ్డగా ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి ధనసరి అనసూర్య(సీతక్క) అన్నారు. మండలంలోని దేవనగరం, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లి, కిందిగుంపు, పేరుకలకుంట, కొత్తచీపురు దుబ్బ, తిమ్మాపురం, నిమ్మగూడెం, చింతకుంట, తక్కెళ్ళగూడెం, దోమెడ తదితర గ్రామాల్లో ఆదివారం సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రచారం కోసం వచ్చిన సీతక్కకు వందల సంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. సీతక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో నృత్యాలు చేస్తూ సీతక్క వెంట ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర ఏళ్ళ కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటల గారడీతో మోసం చేసింది తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. మండల ప్రజల ఓట్లతో గెలిచిన మంత్రి చందూలాల్ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని విస్మరించి తనకొడుకు అజ్మీరా ప్రహ్లాద్ అభివృద్ధి కోసం పీసా చట్టాన్ని అడ్డుపెట్టుకుని ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించకున్నాడని విమర్శించారు.
ప్రస్తుత ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం సీతక్కకు ఓట్లు వేస్తే గిరిజనేతరులకు అన్యాయం జరగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుమ్మడి సోమయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతా పరమాత్మ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టర్‌శెట్టి గౌతమ్‌కుమార్, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్దాబత్తుల జగదీష్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ వల్లేపల్లి శివప్రసాద్. ఎంపీటీసీ జబ్బ సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ అయ్యోరి యానయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment