కాంగ్రెస్, బీజేపీ ఓటమే లక్ష్యం
- పార్లమెంట్‌లో మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయి
- దేశం అభివృద్ధి చెందాలంటే ‘మార్పు’ రావాలి
- అది మోడీ, రాహుల్‌తో సాధ్యం కాదు
- సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, బీజేపీ ఓటమే లక్ష్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఇస్లామియా గ్రౌండ్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే కొత్త రకమైన విధానాలు రావాలని ఆకాంక్షించారు. అప్పుడే పేద ప్రజలకు బతుకుదెరువు దొరుకుతుందని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిరుద్యోగులు ఎక్కువయ్యూరని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాలు ఓ వైపు కుంభకోణాల్లో కూరుకుపోతూనే... ధనికులకు లబ్ధిచేకూరే విధంగా ప్రోత్సహిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇప్పుడు మన దేశానికి కావాల్సింది మార్పు అని... ఆ మార్పును మోడీ, రాహుల్ తీసుకురాలేరన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన వారి ని పట్టుకుని దండించారు.. కానీ, అలాంటి ఫిక్సింగ్ పార్లమెంట్‌లో పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య కొనసాగిందన్నారు.
దీని ప్రభావం దేశ ఆర్థిక విధానాలపై పడిందని, 2జీ, బొగ్గు కుంభకోణాల్లో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యూయని, కాంగ్రెస్, బీజేపీని మట్టికరిపించి ఒక ప్రత్యామ్నా శక్తిగా వామపక్షాలు ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ తన ప్రచారానికి రూ.15 వేల కోట్లు ఖర్చుపెట్టి గెలుస్తానని అనుకుంటున్నారని... కానీ, అది భ్రమగా నే మిగిలిపోతుందన్నారు.ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి చెందుతుందని అనుకోవడం భ్రమేనన్నారు.
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో మనం చూస్తున్నాం కదా... అని పేర్కొన్నాన్నారు. వరంగల్ తూర్పు సీపీఎం అభ్యర్థి మెట్టు శ్రీనివాస్‌ను అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నాగయ్య మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
ఆజంజాహి మిల్లు భూములను హోల్‌సేల్‌గా అమ్ముకుని పరికరాలను రిటేల్‌గా అమ్మి న పాపం టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలదేనని ఆరోపించా రు. కొండా సురేఖను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అజంజాహి మిల్లు కూతను మిమిక్రీతో వినిపిస్తారాని ఎద్దేవా చేశా రు. బస్వరాజు సారయ్య ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. టీఆర్‌ఎస్ కారు ను కొండా మురళి కొనుక్కున్నాడని విమర్శించారు. తూర్పులో 7000 మందికి, పట్టణంలో 20,000 మంది కి గూడు కల్పించింది సీపీఎం పార్టీయేనని స్పష్టం చేశా రు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు సారయ్య, సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు.
సారయ్యకు ఓటు వేస్తే నీళ్లలో వేసినట్లేనని ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. సీపీఎం తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన కారు కాదని... అది సురేఖ కొనుక్కున్న కారని విమర్శించారు. ఇప్పటికైనా... బరిలోనుంచి విరమించుకోవాలన్నారు.
సభ లో ప్రజానాట్యమండలి అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యం లో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగయ్య, కల్లుగీత సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంబీ.రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి చుక్కయ్య, నగర కార్యదర్శి రాగుల రమేష్, సీపీఎం నాయకులు దుబ్బ శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, ముక్కెర రామస్వామి, బోగి సురేష్, పల్లం రవి, కొప్పుల శ్రీనివాస్, సింగారపు బాబు, రత్నమా ల, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, సభలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా సీపీఎం అభ్యర్థి శ్రీరాంని గెలిపించాలని అనడంతో సభకు హాజరైన వారు ఆశ్చర్యంగా చూశా రు. ఇలా రెండు మూడు సార్లు అనడంతో ఆయన పక్కన ఉన్న సీఐటీయూ నగర కార్యదర్శి రాగుల రమేష్ వచ్చి శ్రీరాం కాదు శ్రీనివాసు అని చెప్పడంతో ఏచూరి శ్రీనివాస్ అని ప్రసంగించారు.