- రాజన్న బిడ్డకు బ్రహ్మరథం
- జోష్ నింపిన జగన్ రోడ్ షో
- వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్లో గెలుపు ధీమా
- కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో ఆందోళన
వైఎస్సార్ జనభేరి ప్రచార సభలతో నగరం హోరెత్తింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలవర్షం కురిపించారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, వనస్థలిపురం, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలకు జనం వెల్లువలా తరలివచ్చారు.
సాక్షి, సిటీబ్యూరో : అదే జనం.. ప్రభంజనం.. ఆత్మీయ నీరాజనం.. వెరసి సోమవారం జగన్ రోడ్ షో పార్టీ వర్గాల్లో విజయోత్సాహాన్ని నింపింది. యువకుల బైక్ ర్యాలీ... యువతుల కోలాటం.. అశ్వికదళం.. అభిమాన జనం.. వెంటరాగా భగభగ మండే సూర్యుడిని సైతం లెక్క చేయకుండా పోరాట యోధుడిలా తరలివస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహ్‌న్‌రెడ్డికి జనం పుష్పాభిషేకం చేస్తూ బ్రహ్మరథం పట్టారు. ‘రాజన్న బిడ్డ వచ్చాడంటూ’ ఈలలు.. కేకలు.. చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు. ప్రచార రథం వెంట పరుగులు పెడుతూ..దారి పొడవునా కరచాలనాలు చేస్తూ.. అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు.
జగన్ దారి పొడవునా ఎదురుచూస్తున్న జన సందోహానికి నమస్కరిస్తూ.. వారి కోరిక మేరకు ఒక్కొక్క చోట వాహనం ఆపి, పలకరిస్తూ రెండు చేతులు జోడించి నమష్కరిస్తూ మందుకు కదిలారు. ఎన్నికల ప్రచార యాత్ర సాగిన జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో రహదారులు జనప్రవాహాలై పోటెత్తాయి. ‘జై జగన్’ నినాదంతో మార్మోగాయి. ప్రతిచోటా జగనన్నను చూసేందుకు బడుగు, బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లలు, యువతీ యువకులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. పేదప్రజల సంక్షేమం కోసం పరితపించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని జగన్‌లో చూసుకొని ఉత్సాహభరితులయ్యారు.
జూబ్లీహిల్స్, ఫిలిమ్‌నగర్, బంజారాహిల్స్, ఖైరతాబాద్‌లలోని పలు బస్తీల్లో నిర్వహించిన రోడ్ షోలు, బహిరంగ సభలు జనసంద్రాన్ని తలపించాయి. జహీరానగర్, ఎంఎస్ మక్తాలలో నిర్వహించిన సభలో ముస్లిం సోదరులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని జననేతపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జగన్ రోడ్ షోకు జనం వేలాదిగా తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు.
వనస్థలిపురంలో జరిగిన జనభేరికి అనూహ్య స్పందన లభించింది. ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జననేత ప్రసంగం వినేందుకు తరలివచ్చారు. దివంగత మహానేత చేపట్టిన ఆరోగ్యశ్రీ, 108 వంటి పథకాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. మహానేత అమలు చేసిన పథకాల గురించి జగన్ గుర్తు చేస్తూ.. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి వస్తే జనరంజకమైన పాలన వస్తుందన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ‘జై జగన్ ’ అంటూ నినదించారు. వెరసి జగన్ పర్యటన ఆద్యంతం ఉత్సాహ భరితంగా సాగింది.
వేలాది మంది అభిమానులు ఆయనను దగ్గరి నుంచి చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఆతృత చూపారు. మరోవైపు వృద్ధులు, మహిళలు రాజన్న బిడ్డ వచ్చిండంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం షర్మిల, సోమవారం వైఎస్ జగన్ రోడ్ షోలు విజయవంతం కావటంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్లో, అభిమానుల్లో, కార్యకర్తల్లో గెలుపుపై ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. అభ్యర్థుల బంధువుల్లో నూతనోత్తేజం కన్పించింది.