
'ఆ మంత్రికి నీతి, జాతి లేదు'
హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు నీతి, జాతి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిథి దాసోజు శ్రావణ్ కుమార్ విమర్శించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నేతలు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో.. ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరించారు. హిమాన్షు మోటార్ పై కేటీఆర్ చెప్పినవి పచ్చి అబద్దాలు అని చెప్పారు.
తనకు సంబంధం లేదన్న కేటీఆర్.. మొన్న ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లో చూపింది నిజం కాదా అని ఈ సందర్భంగా శ్రావణ్ ప్రశ్నించారు. టెండర్లు లేకుండా వెంకయ్య నాయుడు కుమారుడికి చెందిన టొయోటా కంపెనీకి ఇన్నోవాలను కొన్నది నిజం కాదా సూటిగా అడిగారు. ఐటీ అవకతవకలకు పాల్పడుతున్న స్వర్ణ భారతి ట్రస్టుకు ఎందుకు రాయితీలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నీతి, నిజాయతీ ఉంటే స్వర్ణ భారతి, హిమాన్షు, సాండ్ మాఫియాపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, లేనిపక్షంలో గన్ పార్క్ దగ్గర బహిరంగ చర్చకు రావాలంటూ కేటీఆర్ కు కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ సవాల్ విసిరారు.