కోదండరాంను పరామర్శించిన వీహెచ్
మన రాష్ట్రంలోనే ఉన్నామా: విమలక్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క పరామర్శించారు. కోదండరాం నివాసానికి గురువారం వచ్చిన వీహెచ్, విమలక్క ర్యాలీ సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. విరిగిన తలుపులు, పోలీసులు చేసిన హడావుడి పరిశీలించారు. నిరుద్యోగ సమస్యపై, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకోసం పోరాడాలని కోదండరాంకు సూచించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఉద్యోగాలు ఇవ్వడంలేదని అడగడమే నేరమా అని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు అడిగేవారు ఉగ్రవాదులా, నక్సలైట్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్బంధం, పోలీసుల అరాచకాలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రంలోనే ఉన్నారా అని అనిపిస్తున్నదని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) నేత విమలక్క అన్నారు. ఎవరైనా దోపిడీ చేస్తే పోలీసులకు చెప్పుకుంటామని, అదే పోలీసులు దాడి చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఉద్యమశక్తుల అణచివేతకే పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. ఇదేనా ప్రజలు కోరుకున్న తెలంగాణ అని విమలక్క ప్రశ్నించారు.