ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల్లో తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై తాము వెనక్కు తగ్గేది లేదని, లీగల్ నోటీసులకు భయపడబోమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం గనుక విచారణ జరిపితే ముడుపుల వ్యవహారాన్ని పూర్తి ఆధారాలతోసహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు, విచారణ సజావుగా సాగాలంటే మంత్రి జగదీశ్ రెడ్డి పదవి నుంచి తొలిగిపోవాలని డిమాండ్ చేశారు.
సోమవారం సీఎల్పీలో విలేకరులతో మాట్లాడిన పొన్నం, సంపత్ కుమార్ ఇద్దరూ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా విరుచుకుపడ్డారు. అవినీతిని సహించేది లేదంటూ డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తొలిగించిన సీఎం.. జగదీశ్ రెడ్డి విషయంలో మౌనంగా ఉండటంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. 5% కమీషన్ల మాటేమిటో తేల్చాలని డిమాండ్ చేశారు.