
కేసీఆర్.. ఈ స్టేట్ నీ ఎస్టేటా?: భట్టి విక్రమార్క
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నీళ్ల పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతోం దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఆయా కార్యక్రమాలకు రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళిక రచించిన ప్రభుత్వంఅంతర్గత ఒప్పందాలతో టెండర్లు కట్టబెడుతూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. పార్టీ అనుబంధ సంఘాల పనితీరును సమీక్షించేందుకు బుధవారం కరీంనగర్ వచ్చిన భట్టి విక్రమార్క డీసీసీ కార్యాలయంలో మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో కలసి మీడియాతో మాట్లాడారు.
‘పాలమూరు ఎత్తిపోతల రీడిజైన్ పేరుతో రూ.36 వేల కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతల పేరుతో రూ.83 వేల కోట్లు, డిండి ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు, మిషన్ భగీరథ పేరుతో రూ.48 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. అందుకోసం ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమవుతున్నారు. ‘కేసీఆర్... ఈ స్టేట్ నీ ఎస్టేట్ కాదు. పార్లమెం ట్‌లో చట్టబద్ధంగా ఏర్పడిన రాష్ట్రమిది. రాజకీయ పునరేకీకరణ పేరుతో దోపిడీదారులు, దళారులను ఏకం చేస్తుంటే, సామాన్యులంతా మరోవైపు ఏకమవుతున్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ పేరుతో పక్కదారి పట్టించే కుట్ర చేస్తూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్నావు’ అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకుమ 15 లక్షల మందిని కాం గ్రెస్ నాయకులుగా తీర్దిదిద్దబోతున్నామని భట్టివిక్రమార్క చెప్పారు.