కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు..
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
కమాన్‌పూర్ : తాను కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజల్లో తనను చులకన చేసేందుకే ప్రత్యర్థులు ఇలా దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మండలంలోని రొంపికుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌ను వదులుతాననే వార్తల్లో నిజం లేదన్నారు. తనను గిట్టనివారే పథకం ప్రకారం దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.
తన తండ్రి శ్రీపాదరావుతో పాటు తనను ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన కాంగ్రెస్‌ను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంతకాలం ప్రజలు తనను ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని, ఈసారి ఓడిపోయినమాత్రాన ప్రజలకు అందుబాటులో ఉండననే అపోహలు పెట్టుకోవద్దన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో కలిసి పోరాడతానన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇనగంటి జగదీశ్వరావు, కుట్కుం నారాయణ, బెల్లంకొండ విజేందర్‌రెడ్డి, గుమ్మడి వెంకన్న, కమ్మగోని మల్లయ్య, కుందారపు బాపు తదితరులున్నారు.