మధిర/బోనకల్: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. మండలంలోని రావినూతల గ్రామంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ పాలన చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిందన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ పార్టీని మోసం చేసి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారన్నారు. రాష్ట్ర సాధన కోసం 20 ఏళ్లు పోరాటం చేశానని విజయశాంతి గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఓటువేస్తే దొరల పాలన వస్తుందన్నారు.
బంగారు తెలంగాణ ఉండదని, రాష్ట్రమంతా సర్వనాశనం అవుతుందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఆ దొర నిజస్వరూపం బయటపడిందన్నారు. రాష్ట్రంలో 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతలకు ఖమ్మంలో సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా తీసి వేసి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు. ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులుగా మారి.. జీవితంపై విరక్తి కలిగేటట్లు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేజీ టు పీజీ విద్య ప్రవేశపెడతామని చెప్పి 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశాడన్నారు.
రానున్నది ప్రజా ప్రభుత్వమే : భట్టి విక్రమార్క
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మధిర నియోజకవర్గానికి వేలాది కోట్ల రూపాయలను తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ ఊసే లేకుండా చేశాడన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ తిన్న సొమ్మును తిరిగి కక్కిస్తామన్నారు. టీడీపీ, టీజేఏసీ, సీపీఐతో కలిగి మహా కూటమిని ఏర్పాటు చేశామని, రానున్నది ప్రజా ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. మధిరలో 35 నుంచి 40వేల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ఆనాడు ఉప సభాపతిగా ఉండి.. తెలంగాణ బిల్లును నా చేతులమీది నుంచి ప్రవేశపెట్టానన్నారు.
బీజేపీ మతోన్మాదం పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తోందన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి బొమ్మ పెట్టుకుని.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసి.. కాంట్రాక్టర్ల కోసం కేసీఆర్ వద్దకు వెళ్లిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తనను విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదన్నారు. మూడు పార్టీలు మారి.. కాంట్రాక్టర్ల సంచులు మోసే లింగాల కమల్‌రాజ్‌ను చూసి ఓటు వేసే అవివేకులు మధిర ప్రజలు కారని, ఇక్కడి ప్రజలు ఎంతో విజ్ఞులన్నారు.
పనులు చేయకుండా బిల్లులు చేయించుకునేందుకే ఎంపీ పొంగులేటి పార్టీ మారారన్నారు. టీఆర్‌ఎస్ పతనం బోనకల్ నుంచే ప్రారంభమైందని, ఈ పార్టీకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బడ్జెట్‌లో కోట్లాది రూపాయలను కేటాయించినప్పటికీ నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి డ్యామ్‌లు ఏమైనా కట్టారా? కొత్త పరిశ్రమలు పెట్టారా? ఎక్కడైనా ఆనకట్టలు నిర్మించారా? అని ఆయన ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ విద్యను అమలు చేయకుండా మోసం చేశాడన్నారు. అమ్మహస్తం పథకాన్ని తీసి వేసి.. 9 రకాల వస్తువులను ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడన్నారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని, రైతు కూలిబంధు పథకాన్ని ప్రవేశపెడతామన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లు సొంత స్థలాల్లో నిర్మించుకునేలా రూ.5లక్షలను లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తామన్నారు.బోనకల్ పోరాటాల పురిటిగడ్డ అని, మూడోసారి తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ రామనాథం, కాంగ్రెస్, టీడీపీ ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పైడిపల్లి కిషోర్, బంధం నాగేశ్వరరావు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment