అక్టోబర్ 23న కానిస్టేబుల్ తుది పరీక్ష
- పోస్టులు 9,613
- పరీక్షకు హాజరయ్యేవారు 81,000
- వెబ్‌సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచిన టీఎస్‌ఎల్పీఆర్బీ
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ తుది రాత పరీక్షను అక్టోబర్ 23న నిర్వహించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్పీఆర్బీ) నిర్ణయించింది. అక్టోబర్ 23 (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుది రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్లను టీఎస్‌ఎల్పీఆర్బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.
పోలీసు విభాగాల్లోని సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్పీ, ఎస్‌ఏఆర్, ఫైర్ సర్వీసెస్‌లలో ఖాళీల భర్తీకి సంబంధించి రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. మొత్తం 9,613 పోస్టులకుగాను 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రిలిమినరీ రాత పరీక్ష అనంతరం 1.92 లక్షల మంది పోటీలో నిలిచారు. దేహదారుఢ్య పరీక్షల అనంతరం తుది రాత పరీక్షకు 81 వేల మంది అభ్యర్థలు అర్హత సాధించారు. మొత్తంగా ఒక్కో పోస్టుకు 8 మంది పోటీలో నిలిచారు. తుది పరీక్షకు సంబంధించి రిక్రూట్‌మెంట్ బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకుంది. ఇప్పటికే అభ్యర్థుల వేలిముద్రలు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను సిద్ధంగా ఉంచుకుంది. అభ్యర్థుల వేలిముద్రలను పరిశీలించాకే అనుమతించేలా చర్యలు చేపట్టింది. మరోవైపు ఎస్సై పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షను నవంబర్‌లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యాక ఎస్సై పోస్టులకు తుది పరీక్ష నిర్వహించనుంది.