కలగానే పార్కు నిర్మాణం
► డెరైక్టర్ ఆదేశించినా.. ఫలితం శూన్యం
► పనుల్లో జాప్యం ఆహ్లాదానికి దూరమవుతున్న స్థానికులు
రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ పట్టణంలో పార్కు నిర్మాణం ఇంకా ‘కల’గానే మిగిలిపోయింది. ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించినా ఆచరణలో పురోగతి కరువైంది. మందమర్రి ఏరియా పరిధిలోని రామకృష్ణాపూర్‌లో పార్కు నిర్మాణం చేపట్టాలని సింగరేణి యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగానే 2008లో దీనికి సంబంధించి పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సదరు నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. పట్టణంలో ఉన్న ఠాగూర్ స్టేడియం ఎదురుగా ఇందుకు అనువైన స్థలం ఉన్నట్లు సూచించారు. సింగరేణి సంస్థకు చెందిన సుమారు ఐదెకరాల భూమిని పార్కు కోసం కేటాయించారు.
డెరైక్టర్ ఆదేశించినా...
‘రామకృష్ణాపూర్ పట్టణంలో పార్కు నిర్మాణం జరుగుతోంది. ఆగష్టు నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది’ అని 2015 మార్చిలో సింగరేణి డెరైక్టర్ (పాజెక్ట్ అండ్ ప్లానింగ్) అన్నారు. సాక్ష్యాత్తు సంస్థ డెరైక్టర్ మాట ఇవ్వడంతో కార్మికులు వారి కుటుంబాలు, ప్రజలు ఎంతో హర్షించారు. పట్టణంలో దాదాపు రెండు వేల మంది కార్మిక కుటుంబాలు నివసిస్తున్నాయి. కార్మికేతరుల సంఖ్య కలిపితే దాదాపు 5వేల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వీరందరికీ పార్కు అందుబాటులో ఉంటే ఎంతో ఆహ్లాదాన్ని అందించే వీలుంటుంది. కానీ పార్కు నిర్మాణంలో కాలయాపన చోటు చేసుకుంటుండటంతో చాలా మంది అసంతృప్తికి గురవుతున్నారు.
పార్కు నిర్మాణం కోసం స్థల సేకరణ పూర్తయి కొంతమేరకు పనులు ప్రారంభించినా నిర్మాణపు పనులు పూర్తిస్థాయిలో జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధకరమని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్‌కేపీలో పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.