కస్టడీకి ఇస్తే రేవంత్ ప్రాణానికి ముప్పు
హైదరాబాద్ : ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డిని కస్టడీకి ఇస్తే అతని ప్రాణానికి ముప్పు ఉందని రేవంత్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఏసీబీ అధికారులు...రేవంత్ రెడ్డిని అయిదురోజుల పాటు కస్టడీ కోరిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు జరుగుతున్నాయి.
రేవంత్ రెడ్డి ఎసిసోడ్ గంట ముందే కేసీఆర్ దీనిపై వ్యాఖ్యానించారని అంతే కాకుండా ఎమ్మెల్యే స్టీవెన్సన్ ఇంట్లో ఉదయం నుంచే ఆ డబ్బు ఉందని రేవంత్ న్యాయవాది వాదనలు వినిపించారు. అంతేకాకుండా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. టీఆర్ఎస్ టార్గెట్ రేవంత్ రెడ్డి అని, ఆయనను పథకం ప్రకారమే ఈ కేసులో ఇరికించారని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు.
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన రోజే కస్టడీ ఎందుకు అడగలేదని, మే 28నే ముందస్తు సమాచారం ఉన్నప్పుడు మే 31 వరకూ ఎందుకు వేచి ఉన్నారని, వీడియో రికార్డింగ్ కోసం టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం అనుమతి తీసుకున్నారా?, ఎవరో పెద్ద వ్యక్తిని కేసులో ఇరికించడానికే కస్టడీ కోరుతున్నారని రేవంత్ తరపు న్యాయవాదులు ఆరోపించారు.
అయితే రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదుల వ్యాఖ్యలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖండించారు. ఎవరినో ఇరికిస్తామని ముందుగా మీకు మీరే ఊహించుకోవడం సరికాదని, విచారణ తర్వాత ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తేలితే కేసులో చేర్చుతామని, తమ దగ్గర ఉన్న పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత కస్టడీ కోరుతున్నామని, నిందితులు తప్పు చేశారనే దానికి తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని పీపీ తెలిపారు.