రేవంత్ కస్టడీపై విచారణ సాయంత్రానికి వాయిదా
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కస్టడీపై విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టులో ఇరు వర్గాలు తమ తమ వాదనలు వినిపించాయి. వాదనలు విన్న కోర్టు విచారణను సాయంత్రానికి వాయిదా వేసింది. ఈ రోజు సాయంత్రమే కస్టడీపై తుదితీర్పు వెల్లడించే అవకాశం ఉంది.
9న రేవంత్ బెయిల్ పిటిషన్పై విచారణ
మరోవైపు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఈ నెల 9వ తేదీన విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్పై 8వ తేదీన ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది. నోటుకు ఓటు కేసులో కోర్టు రేవంత్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు రేవంత్ ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన్ని ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. దాంతో రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నారు.