వరుస వానలతో వ్యవసాయానికి ఊతం | Continuous Rains Spurring Crop Development | Sakshi
Sakshi News home page

వరుస వానలతో వ్యవసాయానికి ఊతం

Published Thu, Aug 8 2019 11:29 AM | Last Updated on Thu, Aug 8 2019 11:29 AM

Continuous Rains Spurring Crop Development - Sakshi

సాక్షి, వికారాబాద్‌: ఇటీవల కురుస్తున్న వర్షాలు ఖరీఫ్‌ సాగుకు ఊతమిచ్చాయి. వర్షాభావంతో కరువు తప్పదనుకున్న సమయంలో వరుసగా కరుస్తున్న వానలు అన్నదాతలను ఆదుకున్నాయి. దీంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. వానలు లేని కారణంగా ఈసారి ఖరీఫ్‌ సాగు తగ్గుతుందని రైతులు, వ్యవసాయ అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే వారం రోజులుగా కురుస్తున్న వానలతో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 91 శాతానికి చేరుకుంది.

ఈసారి సాధారణ సాగు విస్తీర్ణం 1,72,153 హెక్టార్లు ఉండగా.. ప్రస్తుతం 1,55,958 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. వర్షాలు ఇలాగే కురిస్తే రైతులు మరికొన్ని రోజుల వరకు విత్తనాలు వేసే అవకాశం ఉంది. కంది, పొద్దుతిరుగుడు, ఆముదంతో పాటు చిరుధాన్యాల సాగుకు సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌లో వందశాతం పంటలు సాగయ్యే అవకాశముంది.

ఖరీఫ్‌పై రైతుల్లో ఆశలు చిగురించాయి. వరుసగా కురుస్తున్న వానలు కర్షకులను సాగువైపు ప్రోత్సహిస్తున్నాయి. గత రబీలో పంటలు దెబ్బతిన్న అన్నదాతలు కనీసం ఖరీఫ్‌లోనైనా గట్టెక్కవచ్చని భావించారు. సీజన్‌ ఆరంభంలో ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైనా వరుణుడు కరుణించలేదు. జూన్, జూలై మాసాల్లో అడపాదడపా వానలు కురిశాయి. గత రెండు మాసాల్లోనూ జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ చిన్నపాటి వానలు కురిసిన ప్రాంతాల్లో.. రైతులు జొన్న, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, పెసర, మినుము తదితర మెట్ట పంటలు సాగు చేశారు. జూలై రెండో వారం వరకు జిల్లాలో ఖరీఫ్‌ పంటల సాగు లక్ష హెక్టార్లకు చేరుకోలేదు. అయితే జూలై చివరి వారం నుంచి ఇప్పటి వరకు ముసురు వీడటం లేదు.

ఫలితంగా రైతులు 1,55,958 హెక్టార్లలో పంటలు వేశారు. గత వారం రోజులుగా జిల్లాలో ఎడతెరపిలేకుండా మోస్తరు నుంచి జోరు వానలు కురుస్తున్నాయి. ఈనెల 1న జిల్లాలో  157.2.8 మిల్లీమీటర్లు, 2న 384.8 మిల్లీమీటర్లు, 3న 598.7, 4న 263.3, 5వ తేదీన 209.7 మి.మీటర్ష వర్షపాతం నమోదైంది. వరుసగా కురుస్తున్న వానలు పంటలకు ఊపిరిలూదాయి. సీజన్‌ ప్రారంభంలో సరైన వర్షాలు లేక రైతులు సాగు చేసిన మొక్కజొన్న, జొన్న, పత్తి తదితర పంటల్లో ఎదుగుదల లోపం కనిపించినా.. వారం రోజులుగా కురుస్తున్న ముసురుతో కళకళలాడుతున్నాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలు పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, పత్తి తదితర వర్షాధార పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడనున్నాయి. వర్షాలతో పంటల్లో ఎదుగుదల కనిపిస్తోందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే  పంట దిగుబడి కూడా పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.  

1,55,958 హెక్టార్లకు చేరిన ఖరీఫ్‌ సాగు  
జిల్లాలో ఖరీఫ్‌ పంటల సాగు 1,55,958 హెక్టార్లకు చేరుకుంది. 91 శాతం మేర ఖరీఫ్‌ పంటల సాగు పూర్తయింది. 1,72,153 హెక్టార్లకుగాను రైతులు 155,958 హెక్టార్లలో పంటలు వేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు 6,178 హెక్టార్లలో వరి, 2,850 హెక్టార్లలో జొన్న, 27,575 హెక్టార్లలో మొక్కజొన్న, 21 హెక్టార్లలో రాగులు, 12 హెక్టార్లలో కొర్ర పంటలను సాగు చేశారు. అలాగే 54,403 హెక్టార్లలో కంది, 5,252 హెక్టార్లలో పెసర, 3,245 హెక్టార్లలో మినుము, 425 హెక్టార్లలో ఇతర పప్పుధాన్యాలు సాగు చేశారు. 1,210 హెక్టార్లలో సోయాబీన్, 14 హెక్టార్లలో నువ్వులు వేశారు.

కంది పంట తర్వాత జిల్లా రైతాంగం అత్యధికంగా 44,239 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. వికారాబాద్, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువగా పత్తిపంటను వేశారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే పత్తిపంట చేతికి వచ్చితమ కష్టాలు తీరుతాయని ఆశపడుతున్నారు. అలాగే 2,094 హెక్టార్లలో చెరకు, 2,037 హెక్టార్లలో పసుపు, 6,397 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసన వర్షాలు ఆయా పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని వ్యవసాయశాఖ జిల్లా అధికారి గోపాల్‌ తెలిపారు. ఖరీఫ్‌ పంటలసాగు విస్తీర్ణం త్వరలోనే వందశాతం దాటుతామని చెప్పారు. ఈనెల 15వ తేదీ వరకు రైతులు కందులు, చిరుధాన్యాలు, కొర్రలు, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసే అవకాశం ఉందన్నారు. వర్షాల కోసం చూస్తూ ఇప్పటి వరకు పంటలు వేయని రైతులు కంది, చిరుధాన్యాల పంటలను సాగు చేయవచ్చని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement