rains kharif
-
వరుస వానలతో వ్యవసాయానికి ఊతం
సాక్షి, వికారాబాద్: ఇటీవల కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ సాగుకు ఊతమిచ్చాయి. వర్షాభావంతో కరువు తప్పదనుకున్న సమయంలో వరుసగా కరుస్తున్న వానలు అన్నదాతలను ఆదుకున్నాయి. దీంతో జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. వానలు లేని కారణంగా ఈసారి ఖరీఫ్ సాగు తగ్గుతుందని రైతులు, వ్యవసాయ అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే వారం రోజులుగా కురుస్తున్న వానలతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 91 శాతానికి చేరుకుంది. ఈసారి సాధారణ సాగు విస్తీర్ణం 1,72,153 హెక్టార్లు ఉండగా.. ప్రస్తుతం 1,55,958 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. వర్షాలు ఇలాగే కురిస్తే రైతులు మరికొన్ని రోజుల వరకు విత్తనాలు వేసే అవకాశం ఉంది. కంది, పొద్దుతిరుగుడు, ఆముదంతో పాటు చిరుధాన్యాల సాగుకు సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో ఈ సీజన్లో వందశాతం పంటలు సాగయ్యే అవకాశముంది. ఖరీఫ్‌పై రైతుల్లో ఆశలు చిగురించాయి. వరుసగా కురుస్తున్న వానలు కర్షకులను సాగువైపు ప్రోత్సహిస్తున్నాయి. గత రబీలో పంటలు దెబ్బతిన్న అన్నదాతలు కనీసం ఖరీఫ్‌లోనైనా గట్టెక్కవచ్చని భావించారు. సీజన్ ఆరంభంలో ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైనా వరుణుడు కరుణించలేదు. జూన్, జూలై మాసాల్లో అడపాదడపా వానలు కురిశాయి. గత రెండు మాసాల్లోనూ జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ చిన్నపాటి వానలు కురిసిన ప్రాంతాల్లో.. రైతులు జొన్న, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, పెసర, మినుము తదితర మెట్ట పంటలు సాగు చేశారు. జూలై రెండో వారం వరకు జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు లక్ష హెక్టార్లకు చేరుకోలేదు. అయితే జూలై చివరి వారం నుంచి ఇప్పటి వరకు ముసురు వీడటం లేదు. ఫలితంగా రైతులు 1,55,958 హెక్టార్లలో పంటలు వేశారు. గత వారం రోజులుగా జిల్లాలో ఎడతెరపిలేకుండా మోస్తరు నుంచి జోరు వానలు కురుస్తున్నాయి. ఈనెల 1న జిల్లాలో 157.2.8 మిల్లీమీటర్లు, 2న 384.8 మిల్లీమీటర్లు, 3న 598.7, 4న 263.3, 5వ తేదీన 209.7 మి.మీటర్ష వర్షపాతం నమోదైంది. వరుసగా కురుస్తున్న వానలు పంటలకు ఊపిరిలూదాయి. సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు లేక రైతులు సాగు చేసిన మొక్కజొన్న, జొన్న, పత్తి తదితర పంటల్లో ఎదుగుదల లోపం కనిపించినా.. వారం రోజులుగా కురుస్తున్న ముసురుతో కళకళలాడుతున్నాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలు పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, పత్తి తదితర వర్షాధార పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడనున్నాయి. వర్షాలతో పంటల్లో ఎదుగుదల కనిపిస్తోందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే పంట దిగుబడి కూడా పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. 1,55,958 హెక్టార్లకు చేరిన ఖరీఫ్ సాగు జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు 1,55,958 హెక్టార్లకు చేరుకుంది. 91 శాతం మేర ఖరీఫ్ పంటల సాగు పూర్తయింది. 1,72,153 హెక్టార్లకుగాను రైతులు 155,958 హెక్టార్లలో పంటలు వేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు 6,178 హెక్టార్లలో వరి, 2,850 హెక్టార్లలో జొన్న, 27,575 హెక్టార్లలో మొక్కజొన్న, 21 హెక్టార్లలో రాగులు, 12 హెక్టార్లలో కొర్ర పంటలను సాగు చేశారు. అలాగే 54,403 హెక్టార్లలో కంది, 5,252 హెక్టార్లలో పెసర, 3,245 హెక్టార్లలో మినుము, 425 హెక్టార్లలో ఇతర పప్పుధాన్యాలు సాగు చేశారు. 1,210 హెక్టార్లలో సోయాబీన్, 14 హెక్టార్లలో నువ్వులు వేశారు. కంది పంట తర్వాత జిల్లా రైతాంగం అత్యధికంగా 44,239 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువగా పత్తిపంటను వేశారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే పత్తిపంట చేతికి వచ్చితమ కష్టాలు తీరుతాయని ఆశపడుతున్నారు. అలాగే 2,094 హెక్టార్లలో చెరకు, 2,037 హెక్టార్లలో పసుపు, 6,397 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసన వర్షాలు ఆయా పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని వ్యవసాయశాఖ జిల్లా అధికారి గోపాల్ తెలిపారు. ఖరీఫ్ పంటలసాగు విస్తీర్ణం త్వరలోనే వందశాతం దాటుతామని చెప్పారు. ఈనెల 15వ తేదీ వరకు రైతులు కందులు, చిరుధాన్యాలు, కొర్రలు, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసే అవకాశం ఉందన్నారు. వర్షాల కోసం చూస్తూ ఇప్పటి వరకు పంటలు వేయని రైతులు కంది, చిరుధాన్యాల పంటలను సాగు చేయవచ్చని సూచించారు. -
ఖరీఫ్‌కు సిద్ధం..
► అందుబాటులో విత్తనాలు, ఎరువులు ► రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు ► వారంలో రుణ ప్రణాళిక ఖరారు ► బ్యాంకులు రుణాలివ్వకుంటే మా దృష్టికి తీసుకురావాలి ► సాగు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ► 72888 4486, 08682 244560 నంబర్లలో సంప్రదించాలి ► జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు నల్లగొండ అగ్రికల్చర్ : ‘తొలకరి పలకరించింది.. మరో రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రైతులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్నుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ సర్వసన్నద్ధంగా ఉంది.’ అని అంటున్నారు జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. గత ఖరీఫ్‌లో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో రైతులు ఏరువాకకు సిద్ధమవుతున్న సందర్భంగా ఆయన మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. నరసింహారావు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే.. సాగు అంచనా.. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,70,256 హెక్టార్లు కాగా.. ఈ ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురిస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు 3,27,650 హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా పత్తి 2,35,000 హెక్టార్లు, వరి 70,000 హెక్టార్లు, కంది 14,000 హెక్టార్లు, పెసర 3,500 హెక్టార్లు, వేరుశనగ 1,500 హెక్టార్లు, ఆముదం 1,50,000 హెక్లార్లతోపాటు ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది. వరి ఇతర విత్తనాలు.. జిల్లాలో రైతులకు 15,285 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించడానికి ఏర్పాట్లు చేశాం. వరి విత్తనాలు 10 వేల క్వింటాళ్లు, కంది 780 క్వింటాళ్లు, పెసర 400 క్వింటాళ్లు, వేరుశనగ 1,400 క్వింటాళ్లు, మొక్కజొన్న 80 క్వింటాళ్లు, జొన్న 50 క్వింటాళ్లు, సజ్జ 15 క్వింటాళ్లు, ఆముదం 55 క్వింటాళ్లు, జనుము 2,000 క్వింటాళ్లు, ఇతర విత్తనాలు 200 క్వింటాళ్లను సబ్సిడీపై పంపిణీ చేస్తాం. ఇప్పటికే 1,992 క్వింటాళ్ల వరి, 201 క్వింటాళ్ల కంది, 21 క్వింటాళ్ల వేరుశనగ, 614 క్వింటాళ్ల జనుము, 67 క్వింటాళ్ల పిల్లిపెసర.. మొత్తం 2,897 క్వింటాళ్ల విత్తనాలను వివిధ విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. పత్తి విత్తనాలు.. ఖరీఫ్‌లో 3 లక్షల పత్తిగింజల ప్యాకెట్లను జిల్లాకు తెప్పించేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే సగానికి పైగా పత్తి విత్తనాలు మార్కెట్లోని డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో మొత్తం బీటీ పత్తి విత్తనాలు జిల్లాకు రానున్నాయి. పత్తి విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎరువులు.. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో లక్ష మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరమని గుర్తించాం. ఇందులో యూరియా 60 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 20 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాని ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. జిల్లాలో ఇప్పటికే యూరియా 30,449 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3,171 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,683 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 743 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 15,967 మెట్రిక్ టన్నులు.. మొత్తం 52,014 మెట్రిక్ టన్నుల ఎరువులు వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. సీజన్ ప్రారంభం కాగానే నెలనెల వారీగా అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. వారంలో రుణ ప్రణాళిక.. ఖరీఫ్ రుణ ప్రణాళికను వారం రోజుల్లో రూపొందించి ఆమోదించే అవకాశం ఉంది. అయినప్పటికీ బ్యాంకర్లు.. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా పంట రుణాలు అందజేస్తున్నారు. ఎక్కడైనా బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే ఆ బ్యాంకులతో మాట్లాడి రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక సెల్.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా విత్తనాలు, ఎరువుల సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశాం. 72888 94486, 08682 244560 ఫోన్ నంబర్లలకు సమాచారం అందించాలి. జిల్లాకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసినందున రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు.