సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా విరుచుకుపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలందించేందుకు సన్నద్ధమైంది. ప్రస్తుతం కరోనా అనుమానితులకు పరీక్షలు, వైద్య సేవలను కేవలం గాంధీ ఆస్పత్రిలోనే అందజేస్తున్నారు. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటంతో దానికి తగ్గట్టుగా ఆస్పత్రులను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గాంధీతోపాటు మరో 11 ఆస్ప్రత్రులను కరోనా చికిత్సల కోసం విస్తరించాలని నిర్ణయించింది.
దీనిలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఉండగా.. మిగతా ఆస్పత్రులు జంట నగరాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు కావడం గమనార్హం. మరో విశేషమేమిటంటే గచ్చిబౌలి స్టేడియాన్ని కూడా కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల పరీక్షల కోసం ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీంట్లో1,200 పడకలను సిద్ధం చేస్తోంది. ఈ ఆస్పత్రుల్లో 5,113 బెడ్‌లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 4,091 బెడ్‌లను సిద్ధం చేసిన వైద్య,ఆరోగ్య శాఖ రెండు, మూడు రోజుల్లో మరో 1,022 బెడ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగిరం చేసింది.
వెంటిలేటర్లు 255..
వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇచ్చేలా వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్న వైద్య, ఆరోగ్య శాఖ.. మూడు పద్ధతుల్లో బెడ్‌లను సిద్ధం చేస్తోంది. ఐసో లేషన్ బెడ్‌లు, ఐసీయూ బెడ్‌లు, వెంటిలేటర్లతో కూడగట్టిన ఐసీయూ బెడ్‌లుగా విభజించి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 5,113 బెడ్‌లను సిద్ధం చేస్తుం డగా ఇందులో ఐసోలేషన్ బెడ్‌లు 4,497, మిగతా పడకలు ఐసీయూ కేటగిరీలోకి వస్తాయి. మొత్తం ఐసీయూ బెడ్‌లు 616 ఏర్పాటు చేయగా... వీటిలో 255 ఐసీయూ పడకలకు వెంటిలేటర్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. మిగతా 361 బెడ్‌లు కేవలం ఐసీయూ సేవలందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment