
చార్మినార్ వద్ద తగ్గిన సందర్శకులు
చార్మినార్: కోవిడ్–19 వైరస్‌పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో పాతబస్తీలోని జూ పార్కు, సాలార్‌జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియంలను ఈ నెల 21వ తేదీ వరకు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. చార్మినార్‌కు మాత్రం సందర్శనకు అనుమతి ఇచ్చారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా( ఏఎస్‌ఐ) నుంచి ఎలాంటి ఆదేశాలు అందకపోవడంతో చార్మినార్ కట్టడాన్ని మూసి వేయలేదు. జన సమర్ధం గల సందర్శనా ప్రదేశాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలున్నప్పటికీ...కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న చార్మినార్ కట్టడం సందర్శనకు పర్యాటకులను అనుమతించడం పట్ల స్థానిక ప్రజలు తప్పు పడుతున్నారు. చార్మినార్ కట్టడాన్ని సందర్శించడానికి ప్రతి రోజు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని...ఇందులో విదేశీ పర్యాటకులు సైతం పదుల సంఖ్యలో ఉంటారని...అన్ని మ్యూజియంలతో పాటు చార్మినార్ కట్టడం సందర్శనను కూడా బంద్ చేయాలని కోరుతున్నారు.
ఈ నెల 15న(ఆదివారం) చార్మినార్ కట్టడాన్ని 2800 స్వదేశీ పర్యాటకులు, 13 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని...ఒకవైళ జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ ప్రశ్నిస్తున్నారు. జూపార్కు, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహాల్లా ప్యాలెస్, హెచ్‌ఈహెచ్ నిజాం మ్యూజియంలను మూసివేయడంతో ఆయా ప్రాంతాల్లో సందర్శకుల సందడి పూర్తిగా తగ్గిపోయింది. సోమవారం పాతబస్తీలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. చార్మినార్, మక్కా మసీదు, లాడ్‌బజార్ తదితర పరిసరాలన్నీ వినియోగదారులు లేక బోసిపోయి కనిపించాయి. తమకు ఉన్నతాధికారుల నుంచి ఇంత వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని...అందేంత వరకు చార్మినార్ సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తామని చార్మినార్ కన్జర్వేటివ్ అసిస్టెంట్ డాక్టర్ భానుప్రకాష్ తెలిపారు.