మృతదేహం మీరే ఉంచుకోండి | CoronaVirus: Private Hospital Charges RS 11 Lakh For Treatment | Sakshi
Sakshi News home page

మృతదేహం మీరే ఉంచుకోండి

Published Wed, Jul 8 2020 3:53 AM | Last Updated on Wed, Jul 8 2020 5:53 AM

CoronaVirus: Private Hospital Charges RS 11 Lakh For Treatment - Sakshi

రాంగోపాల్‌పేట్‌: కరోనాతో సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు మరణించాడు. చికిత్సకు సంబంధించి ఆస్పత్రి యాజమాన్యం రూ.11.50 లక్షల బిల్లు వేసింది. ఇంకా తమకు చెల్లించాల్సిన రూ.5 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఒకానొక సమయంలో మృతదేహం అప్పగించకపోతే అంత్యక్రియలు మీరే చేసుకోండని బాధితులు కరాఖండీగా చెప్పడంతో ఆస్పత్రి వర్గాలు దిగి వచ్చాయి. యాదగిరిగుట్టకు చెందిన నవీన్‌కుమార్‌ (28) అనారోగ్యంతో గత నెల 23వ తేదీన సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆస్పత్రి వర్గాలు 24వ తేదీన కరోనా పరీక్షలు చేయగా అతనికి నెగెటివ్‌గా వచ్చింది. 26వ తేదీ మరోమారు చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. 

అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం నవీన్‌కుమార్‌ మరణించాడు. అప్పటికే కుటుంబ సభ్యులు రూ.6.50 లక్షల రూపాయలు చెల్లించగా, మరో రూ.5 లక్షల పెండింగ్‌ బిల్లు  చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఊర్లో ఉన్న పొలం అమ్మి డబ్బు చెల్లించామని, ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వకూడా లేదని బాధితులు చెప్పారు. డబ్బు చెల్లిస్తే తప్ప మృతదేహాన్ని అప్పగించేది లేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో మృతదేహం మీరే ఉంచుకోండని బాధితులు ఆస్పత్రి వర్గాలతో చెప్పడంతో మరో రూ.20 వేలు కట్టించుకుని మృతదేహాన్ని పంపించారు. ఎర్రగడ్డలోని స్మశాన వాటికలో అధికారుల పర్యవేక్షణలో మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. 

బ్రతికున్నాడో లేదో చెప్పడం లేదు రూ.15 లక్షల బిల్లు వేశారు: బంధువుల ఆరోపణ
కాగా, మరో కేసులోనూ ప్రైవేట్‌ ఆసుపత్రి దారుణం వెలుగుచూసింది. సికింద్రాబాద్‌ గాస్మండికి చెందిన 55 సంవత్సరాల వ్యక్తి మోండా మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా లక్షణాలతో ప్యారడైజ్‌ ప్రాంతంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో గత నెల 13వ తేదీన చేరాడు. అతనికి చేసిన కరోనా టెస్టుల్లో పాజిటివ్‌ రాగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆ రోజు నుంచి నేటివరకు రూ.13 లక్షల బిల్లు కాగా ఇన్సూరెన్స్, నగదు కలిపి రూ.5 లక్షలు చెల్లించారు. అయితే ఆస్పత్రి వర్గాలు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయనీ, రోగి బ్రతికి ఉన్నాడో లేదో కూడా చూపించడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. రూ.8 లక్షలు చెల్లిస్తేనే రోగిని చూపిస్తామని అంటున్నారని వారు ఆరోపించారు. 

మూడు అందుబాటులోకి రాలేదు: ఆస్పత్రి వర్గాలు
ఆరోపణలపై ఆస్పతి వర్గాలు స్పందిస్తూ, ‘ఇంతవరకు రోగికి అందించిన చికిత్సకు రూ. 16 లక్షలు బిల్లు అయింది.. మూడు లక్షల ఇన్సూరెన్స్, రూ.2 లక్షలు క్యాష్‌ రూపంగా చెల్లించారు. మిగతాది చెల్లించాల్సి ఉంది. మూడు రోజుల క్రితం రూ. 3 లక్షలు బిల్లు కడతానని చెప్పిన రోగి అటెండెంట్‌ ఇప్పటివరకు మళ్లీ  అందుబాటులోకి రాలేదు. అంతకు ముందు పేషెంట్‌ కూతురు వస్తే పీపీఈ కిట్లు వేసి రోగిని చూపించాం. ఎప్పటికప్పుడు రోగి కండీషన్‌ ఫోన్‌ ద్వారా తెలియ చేస్తున్నాము. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం ఆయన పరిస్థితి విషమంగా ఉంది’ అని వెల్లడించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement