సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం అదృశ్యమవడం కలకలం రేపింది. మెహదీపట్నంకు చెందిన రషీద్ అలీ అనే వ్యక్తికు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 8న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. 10న ఉదయం అతడు మృతిచెందడంతో ఆస్పత్రి వర్గాలు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఆస్పత్రికి రాగా మార్చురీలో మృతదేహం కనిపించకుండా పోయింది.
దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆస్పత్రికి చేరుకొని విచారణ చేపట్టగా రషీద్ మృతదేహాన్ని మరొకరికి అప్పగించినట్లు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లి రషీద్ మృతదేహాన్ని తీసుకొచ్చి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా రషీద్ మృతదేహం కోసం 12 గంటల పాటు ఆస్పత్రి వద్ద ఆందోళనలు చేశారు. చివరికి మృతదేహాన్ని అప్పగించడంతో వైద్యసిబ్బంది సహాయంతో అంత్యక్రియలకు తీసుకెళ్లారు. అయితే కరోనా రోగి మృతదేహం పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేకమార్లు మృతదేహాలు తారుమారైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment