సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంతోపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రేపట్నుంచి దాదాపు రెండు వారాలపాటు రొటేషన్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. రోజువారీ కార్య కలాపాలను సగం మందితోనే నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. అలాగే గర్భిణులు, దీర్ఘ కాలిక వ్యాధులు, వ్యాధి లక్షణాలుగల ప్రభుత్వ ఉద్యోగులు సెలవు తీసుకొని ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఇలాంటి వ్యక్తులు సాధారణ సెలవు (సీఎల్), ఆర్జిత సెలవులు (ఈఎల్), మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా సగం వేతనం చెల్లింపు (హాఫ్ పే) సెలవు తీసుకోవాలని సూచించింది.
సెలవు తీసుకున్నా పని ప్రదేశంలో అందుబాటులోనే ఉండాలని, వారి సేవలు అవసరమైనప్పుడు కబురు అందిస్తే కార్యాలయా నికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్యోగులంతా తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించిన ప్రభుత్వం... సందర్శకుల రాక పోకలపైనా ఆంక్షలు విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శని వారం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు ఈ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మార్గదర్శకాలు కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ) పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకే వర్తిస్తాయని స్పష్టతనిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. అయితే అత్యవసర సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నిబంధనలు వర్తించవని వెల్లడించారు.
కేసులు పెరగడంతో...
రాష్ట్రంలో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్, ఒక ఐఏఎస్ అధికారి కరోనా బారినపడగా సచివాలయంలో ఏకంగా 18 మందికి ఈ వైరస్ సోకింది. హజ్‌హౌస్‌లోని తెలంగాణ వక్ఫ్ బోర్డు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కింది స్థాయి ఉద్యోగి శుక్రవారం కరోనాతో మరణించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచడంతో కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఉద్యోగుల్లో కరోనా కలవరం మొదలైంది. విధులకు హాజరవ్వాలంటేనే సిబ్బంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలు ఇవీ...
- 50 శాతం మంది ఆఫీస్ సబార్డినేట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర 4వ తరగతి ఉద్యోగులు వారం తప్పించి మరో వారం విధులకు హాజరవ్వాలి.
- 50 శాతం మంది క్లరికల్ స్టాఫ్/సర్కులేటింగ్ ఆఫీసర్లు రోజు తప్పించి రోజు విధులకు రావాలి.
- ప్రత్యేక చాంబర్లు ఉన్న అధికారులు మాత్రం రోజూ విధులకు హాజరు కావాలి.
- సెక్షన్ అధికారులు, సహాయ సెక్షన్ అధికారులు, క్లరికల్ స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర 4వ తరగతి ఉద్యోగులు విధులకు హాజరుకాని రోజుల్లో వారు పనిచేసే ప్రాంతం (హెడ్‌క్వార్టర్)లోనే ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో కూడా పనిచేసే ప్రాంతాన్ని వదిలి వెళ్లడానికి వీల్లేదు. కార్యాలయంలో ఏదైనా పని కోసం వారిని అప్పటికప్పుడు పిలిచే అవకాశం ఉంటుంది.
కార్యాలయాల్లో మార్గదర్శకాలు...
- సంబంధిత అధికారి నుంచి అపాయింట్‌మెంట్‌తోపాటు అనుమతి కలిగి ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాలకు సందర్శకులను రానివ్వాలి.
- లిఫ్టు ఆపరేటర్‌తోపాటు మరో ముగ్గురిని మాత్రమే ఆఫీసు లిఫ్టుల్లో అనుమతించాలి.
- క్రమం తప్పకుండా కార్యాలయాలు, వాహనాలను డిస్‌ఇన్‌ఫెక్ట్ (రసాయనాలతో పిచికారి చేసి క్రిములను చంపడం) చేయాలి.
- మధ్యహ్న భోజన విరామ సమయంతోపాటు అన్ని వేళలా సిబ్బంది భౌతికదూరం పాటించాలి. సిబ్బంది ఇంటి నుంచే భోజనాన్ని తీసుకొని రావాలి.
- మధ్యాహ్న భోజన విరామ సమయంలో అందరూ ఒకేచోట కూర్చోకూడదు.
- క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం/శానిటైజేషన్, మాస్కులను ధరించడం వంటి జాగ్రత్తలను ఉద్యోగులంతా తప్పనిసరిగా పాటించాలి.
- డ్రైవర్లందరూ సంబంధిత పేషీ వద్ద కూర్చోవాలి. ఒకేచోట గూమికూడరాదు.
- అధికారులందరూ గదుల్లో ఏసీల వినియోగాన్ని విరమించుకోవాలి. గదుల్లో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
- కరోనా నివారణపై ఉద్యోగులకు అవగాహన కల్పించడానికి ప్రజారోగ్య విభాగం డైరెక్టరేట్, కాళోజి నారాయణరావు ఆరోగ్య వర్శిటీ ప్రచార కార్యక్రమాలను రూపొందించాలి.
Comments
Please login to add a commentAdd a comment