సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల. చిత్రంలో శాంతికుమారి తదితరులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడి స్తున్న కోవిడ్ మహమ్మారి మన రాష్ట్రంలోనూ ప్రవేశించింది. రాజధాని హైదరాబాద్‌లో తొలి కోవిడ్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు ద్వారా నగరానికి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందొద్దని, ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని, వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చే సూచనలు, సలహాలను పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఢిల్లీ, హైదరాబాద్‌లలో ఒక్కో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైందని సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌కు చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని వెల్ల డించారు.
‘‘బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఆ యువకుడు కంపెనీ పని మీద గతనెల 15న దుబాయ్ వెళ్లి, అక్కడ హాంకాంగ్ ప్రతినిధులతో కలిసిమెలిసి ఉండడం వల్ల వైరస్ సోకినట్లు తేలింది. అనంతరం 20న దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చి, ఓ రోజు ఆఫీసుకు కూడా వెళ్లాడు. 22న బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్ వచ్చాడు. ఐదారు రోజులు ఇంట్లోనే ఉన్న తర్వాత దగ్గు, తుమ్ములతో సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడు. అపోలో సిబ్బందికి అనుమానం రావడంతో ఆదివారం గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ముందుగా స్వైన్‌ఫ్లూ పరీక్ష చేశారు. అది కాదని తేలడంతో కోవిడ్ పరీక్ష చేశారు. అందులో పాజిటివ్ వచ్చింది.
దీంతో మరోసారి నిర్దారించేందుకు పుణెలోని వైరాలజీ సెంటర్‌కు నమూనాలు పంపించారు. అక్కడ కూడా అదే తేలింది. ప్రస్తుతం ఆ యువకుడికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేటెడ్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. అపోలోలో ఆ యువకుడికి చికిత్స అందించిన 23 మంది వైద్య సిబ్బందితోపాటు ఆ యువకుడు బెంగళూరు ఉంచి హైదరాబాద్ వచ్చిన బస్సులో ప్రయాణించిన మరో 27 మందిలో కొందరిని గుర్తించాం. మొత్తమ్మీద ఆ యువకుడు కలిసినవారిలో ఇప్పటివరకు మొత్తం 80 మందిని ట్రాక్ చేశాం’’అని వివరించారు.
నేడు ఉపసంఘం భేటీ..
బాధిత యువకుడిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేట్ గదిలో ఉంచి చికిత్స ఇవ్వాలని, ఇతరులకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్టు ఈటల వెల్లడించారు. ఈ విషయంలో వైద్య ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆదేశించినట్టు చెప్పారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి తదితరులున్న ఈ ఉపసంఘం మంగళవారం భేటీ అవుతుందన్నారు. అలాగే పురపాలకశాఖ అధికారులతో కూడా సమావేశాన్ని నిర్వహించి, తగిన చర్యలు చేపట్టాలని కేసీఆర్ సూచించినట్టు తెలిపారు. ప్రజలు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఈటల విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా జన సమ్మర్థం ఉన్న ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
‘‘దేశంలోగానీ, మన రాష్ట్రంలో గానీ ఇక్కడ ఉన్నవారితో ఇంత వరకు వైరస్ సోకలేదు. చైనా, ఇటలీ, హాంకాంగ్, ఇతర దేశాల నుంచి ఇన్‌ఫెక్ట్ అయి వస్తున్నారే తప్ప.. ఇక్కడి వారికి మాత్రం ఆ వైరస్ లేదు. ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా, తేమ తక్కువగా ఉన్నందున కోవిడ్ విస్తరించే అవకాశాలు పెద్దగా లేవు. మన జీవన విధానాన్ని పరిశీలించినా వైరస్ సోకే అవకాశం లేదు. అయితే, ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎవరికైనా జలుబు చేసినా, ముక్కు కారినా, జ్వరం వచ్చినా.. తక్షణమే వైద్యులను సంప్రదించాలి. తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. జలుబు, జ్వరం వంటివి ఉన్నవారు బహిరంగంగా తుమ్మడం, దగ్గడం వంటివి చేయకూడదు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ముక్కుకు రుమాలు అడ్డుగా పెట్టుకోవడం విధిగా చేయాలి. అన్ని స్థానిక, బోధనాసుపత్రులు, జిల్లాల్లోని పెద్దాసుపత్రుల్లో పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో 40 పడకల చొప్పున ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటుచేశాం.
పల్మనాలజిస్టులను కూడా నియమించాం. నిజానికి 100 శాతం మంది వ్యాధిగ్రస్తుల్లో 5 శాతం మందికే న్యూమోనియా వచ్చే ఆస్కారముంటుంది. ఇతర దేశాల నుంచి ఇన్‌ఫెక్ట్ అయి వచ్చినవారికి చికిత్స చేయడంతో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. ఈ వైరస్‌తో చనిపోయిన సంఘటనలు మనదగ్గర లేవు. కేంద్రం కూడా వివిధ దేశాల నుంచి వచ్చిన అనుమానితులను ఐసోలేటెడ్ వార్డుల్లో పెట్టి చికిత్స ఇవ్వడంతో వారికి ముప్పు తప్పింది. హైదరాబాద్‌లోని మిలటరీ ఆస్పత్రిలోనూ 100 పడకల ఐసోలేటెడ్ వార్డు అందుబాటులో ఉంది’’అని ఈటల వివరించారు.
గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు
వైరస్ విస్తరించకుండా పకడ్బందీ చర్యలు...
కోవిడ్ వైరస్ సోకిన యువకుడు ఏ బస్సులో ప్రయాణించాడు? ఏ కంపెనీలో పని చేస్తున్నాడు? ఆయనతో కలిసిమెలిసి ఉన్నవారెవరు అన్న వివరాలన్నింటినీ గుర్తించినట్టు మంత్రి తెలిపారు. వాళ్లకు కూడా పరీక్షలు చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ఆ యువకుడు పనిచేసిన బెంగళూరు కంపెనీకి కూడా సమాచారం ఇచ్చినిట్టు చెప్పారు. వైరస్ విస్తరించకుండా ఉండడానికి అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అవసరమైతే పల్మనాలజిస్టులు, యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, న్యూరాలజిస్టులను మరింత మందిని ఐసోలేటెడ్ వార్డుల్లో నియమించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే నయం అవుతుందని చెప్పారు. డాక్టర్లు, స్పెషలిస్టులు, ల్యాబ్ వంటి అన్ని ఏర్పాట్లు ఉండటంతో గాంధీ ఆస్పత్రిలోనే బాధితుడికి చికిత్స ఇస్తున్నట్టు వివరించారు. ఐసోలేటెడ్ వార్డు దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లరని, దాంతో ఎవరికీ ఎలాంటి సంబంధం ఉండదని, అందువల్ల ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉండదని స్పష్టంచేశారు. మీడియా కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్లొద్దని మంత్రి సూచించారు.
ఆ యువకుడు ప్రయాణించి బస్సులో ఉన్న 27 మందికీ వైరస్ ఉన్నట్టు భావించొద్దన్నారు. అతడి కుటుంబ సభ్యులను కూడా కలిశామని, వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపారు. ఆ యువకుడు పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో కూడా మాట్లాడినట్టు చెప్పారు. రాష్ట్రంలో మాస్కుల కొరత లేదని, ఇంకా అవసరమైన మేరకు ఆర్డర్లు కూడా ఇచ్చామని మంత్రి వెల్లడించారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైతే ప్రత్యేక నిధిని తీసుకోవాలని సీఎం కూడా చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రోగులను 14 రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తామని వివరించారు. మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా, వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ జాగ్రత్తలు
- జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
- జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు/కర్చీఫ్‌లు కట్టుకోవాలి.
- చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
- దూర ప్రయాణాల వాయిదా మంచిది.
- పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.
- దగ్గు, జ్వరం ఉన్నవారికి దూరంగా ఉండాలి.
- అనుమానిత లక్షణాలుంటే 14 రోజుల వరకు ప్రత్యేక గదిలో నిద్రించాలి.
- ఏదైనా అనుమానం ఉంటే వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన
- ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 040–24651119కు కాల్ చేయాలి.
ట్రైనీ కానిస్టేబుళ్లకు స్వైన్‌ఫ్లూ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న పలువురు అభ్యర్థులు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారని సమాచారం. రెండు మూడు రోజులుగా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న దాదాపు 35 మంది హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చారని, వారిలో ఒక్కరికి మాత్రం స్వైన్‌ఫ్లూ పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. కేవలం ఒక్కరు మాత్ర మే తమ వద్ద స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నగరంలో కోవిడ్–19 పాజిటివ్ కేసు నమోదైన దరిమిలా.. పోలీస్ కానిస్టేబుళ్లకు స్వైన్‌ఫ్లూ రావడం కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment