
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధిలో భాగంగా శిక్షణతో కూడిన ఉపాధికి పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లను దత్తత తీసుకుని విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖతో అవగాహన కుదుర్చుకుని అభ్యర్థులకు వివిధ రంగాల్లో శిక్షణ, నైపుణ్యం ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐటీఐలున్నాయి.
వీటి పరిధిలో దాదాపు 60 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పరిశ్రమల్లో ఐటీఐ ట్రేడ్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జూనియర్ స్థాయి నుంచి వచ్చేవాళ్లు కావడంతో తక్కువ వేతనంతో మెరుగైన పనిచేస్తారనే భావన ఉంది. ఈ క్రమంలో ఐటీఐ ట్రేడ్ ఉన్న అభ్యర్థులవైపు పరిశ్రమలు చూస్తున్నాయి. అప్రెంటీస్‌షిప్‌కు అవకాశమిస్తూ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పనకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు పలు కంపెనీలు మొగ్గుచూపాయి. దీంతో ఆ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ కంపెనీలు సీఎస్‌ఆర్ కింద శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపక్రమించాయి.
60 ఐటీఐలు దత్తత...
పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా ప్రభుత్వ ఐటీఐలపైనే దృష్టి పెట్టాయి. ప్రస్తుతం 65 ప్రభుత్వ ఐటీఐలుండగా వీటిలో 60 ఐటీఐలను ప్రముఖ సంస్థలు దత్తత తీసుకున్నాయి. కార్పొరేట్ సంస్థలు, ఎంఎన్‌సీలు 15 ఐటీఐలను దత్తత తీసుకోగా మిగతా 45 ఐటీఐలను స్థానికంగా పేరున్న సంస్థలు దత్తత తీసుకుని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా డిమాండ్ ఉన్న రంగాల్లో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఐటీఐ యాజమాన్యాలు వసతులు కల్పిస్తుండగా, దత్తత తీసుకున్న సంస్థలు నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహిస్తున్నాయి. శిక్షణ పొందిన తర్వాత క్యాంపస్ సెలక్షన్లు పెట్టి ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కేవై నాయక్ ‘సాక్షి’తో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment