కార్పొరేట్ బందీలు | Corporate prisoners | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ బందీలు

Published Wed, Aug 19 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

కార్పొరేట్ బందీలు

కార్పొరేట్ బందీలు

♦ విద్యాసంస్థల బలవంతపు చదువులు
♦ హాస్టళ్లుగా అపార్టుమెంట్లు   
♦ కనీస వసతుల కరువు  
♦ లక్షల్లో ఫీజులు..పెట్టేది నాసిరకం భోజనం
♦ చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థులు
 
 ప్రశాంత వాతావరణంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు జైళ్లను తలపిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న తల్లిదండ్రుల ఆశలను క్యాష్ చేసుకుంటున్న కార్పొరేట్ సంస్థలు ర్యాంకులే పెట్టుబడిగా వ్యాపారం సాగిస్తున్నాయి. విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో నిర్యక్ష్యం వహిస్తున్నాయి. పోటీ పేరుతో విద్యార్థులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచు తుండటంతో చివరకు వారు తట్టుకోలేక భయం తో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల విద్యా సంస్థల హాస్టళ్లలో చోటుచేసుకుంటున్న సంఘటలే ఇందుకు నిదర్శనం.
 
 నెల్లూరు (టౌన్) : విద్యపరంగా జిల్లాకు మంచిపేరు ఉంది. దీంతో రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా విద్యనభ్యసిస్తున్నారు. ఐఐటీల పేరుతో లక్షల్లో పీజులను వసూలు చేస్తున్న విద్యాసంస్థలు కనీసవసతుల కల్పించడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లాలో చాలా విద్యాసంస్థలు అనుమతులు లేకుండానే హస్టళ్లను నడుపుతున్నాయి. అలాంటి విద్యాసంస్థలను కట్టడి చేయాల్సిన అధికారులు వారిచ్చే కాసులకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కొన్ని విద్యాసంస్థలు ఏకంగా కళాశాలపైనే రూములను హాస్టళ్లుగా మార్చివేశాయి. మరి కొన్ని అపార్టుమెంట్లను హాస్టళ్లుగా మారుస్తున్నాయి.

ఒక్కో గదికి ఆరుగురు మాత్రమే ఉండాల్సి ఉన్నా డబ్బు కక్కుర్తితో 10 నుంచి 15మంది విద్యార్థులను ఉంచుతున్నారు. విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవలను కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు తగ్గ టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేయ డం లేదు. లక్షల్లో ఫీజు తీసుకుని నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

 నిబంధనల పేరుతో వేధింపులు
 కార్పొరేట్ సంస్థలు నిబంధనల పేరుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను వేధిస్తున్న సంఘటనలున్నాయి. ఆరోగ్యం సరిగాలేదని చెప్పినా వినకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేస్తామని బెదిరిస్తున్నారు. సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినట్లయితే ఇంటికి ఫోన్ చేసి చదవడం లేదు, తీసుకెళ్లాలని చెప్పడంతో విద్యార్థులు మానసికి ఒత్తిడికి గురవుతున్నారు. నెలలో చివరి ఆదివారం మాత్రమే విద్యార్థులను కలిసే అవకాశాన్ని తల్లిదండ్రులకు కల్పిస్తున్నారు. ఏదైన వ్యక్తిగత విషయాన్ని చెప్పాలన్నా విద్యార్థులు నెలరోజులు ఆగాల్సిందే. సిలబస్ పేరుతో ఇంటిలో శుభకార్యాలకు విద్యార్థులను దూరంగా ఉంచుతున్నారు. ప్రధానంగా టాయ్‌లెట్స్‌ను శుభ్రంగా ఉంచ డం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

 ఉదయం నుంచి రాత్రిదాక పుస్తకంతోనే...
 హోస్టళ్లలో విద్యార్థులు ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తకాలతోనే గడుపుతున్నారు. ఉదయం 5 నుంచి మొదలు రాత్రి 10 వరకు వారిపై చదువుల భారాన్ని మోపుతున్నారు. మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్‌కు చెబుతారన్న భయం విద్యార్థుల్లో నెలకొంది. దీంతో విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులకు చెప్పలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవేమీ పట్టిం చుకోని కాలేజీలు ర్యాంకుల కోసం గుడ్డిగా సిలబస్ రుద్దుతున్నారు.
 
 ఇష్టపడి చదివితేనే మార్కులు
 ఇష్టపడి చదివితేనే మంచి మార్కులు వస్తాయి. చదువును వారిపై బలవంతం గా రుద్దకూడదు. ర్యాంకులు కోసం కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి. తల్లిదండ్రులు కూడా వారి మానసిక స్థితిని తెలుసుకోవాలి.
 -ఆచార్య ఆదిత్య, విద్యావేత్త

 ఒత్తిడిలేని విద్యను అందించాలి
 విద్యాసంస్థలు ఒత్తిడి లేని విద్యను అందించాలి. చదువుకునేందుకు విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పించాలి. అనుమతి లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకుంటాం.
 -బాబూజాకబ్, ఆర్‌ఐఓ

 సామర్థ్యంతో సంబంధం లేకుండా లక్ష్యం దారుణం
 కార్పొరేట్‌రంగం ఉన్నంతకాలం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. విద్యార్థుల సామర్థ్యంతో సంబంధం లేకుండా లక్ష్యాన్ని విధిస్తున్నారు. దీంతో విద్యార్థు లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను అర్థం చేసుకోవాలి.
 - విఠపు బాలసుబ్రమణ్యం, ఎమ్మెల్సీ

 ఒత్తిడి పెంచుతున్నారు:
 రెసిడెన్షియల్ కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. కేవ లం మార్కులు, ర్యాంకుల కోసం తలకు మించిన భారాన్ని మోపుతున్నారు. తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి.
 -డోర్నాదుల సుబ్బమ్మ

 మార్కులు కాదు..జీవితం ముఖ్యం:
 తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. కేవలం మార్కులే చదువనే ధృక్పథం మారాలి. యాజమాన్యాలు కూడా ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచాలి. ఆటలు, సాంసృ్కతిక కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులను ప్రోత్సహించాలి.         
-హాజి అమీనుద్దీన్ అహ్మద్(పెరేంట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement