పత్తి వ్యాపారులతో సీసీఐ ప్రతినిధుల ఒప్పందం
రూ.40 కోట్లకు పైగానే వ్యాపారుల వశం!
రూ. 5 కోట్ల మేరకు అధికారుల చేతివాటం?
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
వ్యాపారులతో కుమ్మక్కై సీసీఐ ప్రతినిధులు అవినీతి అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నారుు. రైతులకు చెందాల్సిన రూ.40కోట్ల సొత్తును ఇద్దరు కలిసి కైంకర్యం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.5 కోట్ల మేరకు అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఈ అక్రమం బయటపడాలంటే.. పెద్ద మొత్తంలో సరుకు అమ్మిన రైతులకు ఎంత భూమి ఉంది? ఆ భూమిలో వారు పత్తినే సాగు చేశారా? అసలు ఆ రైతులు గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేస్తున్నారా? అనే విషయాలను పరిశీలించాలని రైతు ప్రతినిధులు సూచిస్తున్నారు.
ఖమ్మం వ్యవసాయం: పత్తి రైతులకు మద్దతు ధరను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూ (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు వ్యాపారులు, ఆ శాఖ అధికారులకు సిరులు కురిపిస్తున్నాయి. కాటన్ కార్పొరేషన్, వ్యాపారులు కుమ్మక్కయ్యారు. రైతులకు చెందాల్సిన సొత్తును దోచుకుంటున్నారు. ప్రణాళికబద్ధంగా అక్రమ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. రైతులకు చెందాల్సిన దాదాపు రూ.40 కోట్లను వ్యాపారులు, సీసీఐ అధికారులు పంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థ రూపొందించిన నిబంధనలను సీసీఐ అధికారులు తుంగలో తొక్కి ఈ అక్రమ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్రమం ఇలా..
తేమశాతం ఆధారంగా కేంద్రప్రభుత్వం పత్తికి మద్దతు ధరను క్వింటాలు రూ.4,050గా నిర్ణరుుంచింది. పత్తి ఉత్పత్తి ఆరంభంలో వ్యాపారులు ఈ ధర పెట్టలేదు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించేందుకు జిల్లాలో 8 సీసీఐ కేంద్రాలను తెరిచారు. ఈ కేంద్రాల్లో సీసీఐ బయ్యర్లను నియమించి పత్తి కొనుగోళ్లు జరుపుతోంది. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో పాటు జిల్లాలో 4 జిన్నింగ్ మిల్లుల్లో కూడా పత్తి కొనుగోళ్లకు అనుమతించింది. రైతులు పహణి నకలుతో తాము పండించిన పంట ఉత్పత్తిని తీసుకొని సీసీఐ కేంద్రానికి రావచ్చు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందొచ్చు. ఈ కేంద్రాల్లో సరుకు అమ్ముకున్న రైతులకు వారం రోజుల్లో చెక్కులు అందేవిధంగా నిర్ణయించారు. ఈ వ్యవహారాన్నంతటినీ వ్యాపారులు వ్యూహాత్మకంగా తమ వ్యాపారానికి అనుకూలంగా మలుచుకున్నారు. సీసీఐ ప్రతి నిధులను వలలో వేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నా రు. వ్యాపారుల గుప్పిట్లో ఉన్న సీసీఐ ప్రతినిధులు రైతులు తెచ్చే సరుకును నాణ్యత లేదని, తేమ శాతం అధికంగా ఉందనే సాకులు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చెక్కులను కూడా బాగా జాప్యం చేస్తున్నారు. నెల రోజుల దాకా తిప్పించుకుంటున్నారు. ఈ చెక్కుల్లో కూడా తప్పుల తడకలు ఉంటున్నాయి. ఈ ఇబ్బందులను భరించలేక రైతు లు వ్యాపారులకే సరుకును అమ్ముకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులు పత్తి నాణ్యతను బట్టి రూ.3200 నుంచి రూ.3,700 వరకు ధర పెడుతున్నారు. తిరిగి ఈ సరుకును బినామీ రైతుల పేరుతో వ్యాపారులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రరుుస్తున్నారు. మద్దతు ధర రూ.4050 వరకు అమ్ముతున్నారు. రైతులకు అందాల్సిన మద్దతు ధరను ఇలా వ్యూహాత్మకంగా కొల్లగొడుతున్నారు. వ్యాపారులతో కుమ్మక్కైన సీసీఐ ప్రతినిధులకు కూడా భారీగానే ముడుపులు అందుతున్నట్లు తెలుస్తోంది. క్వింటాలుకు రూ.400 వరకు రైతుకు అందాల్సిన సొత్తును వ్యాపారులు, సీసీఐ అధికారులు పంచుకున్నట్ల్లు ఆరోపణలు వస్తున్నారుు.
రూ.45 కోట్ల మేరకు అక్రమం!
జిల్లాలో ఇప్పటి వరకు సీసీఐ పత్తి కొనుగోళ్ల వ్యవహారం పరిశీలిస్తే దాదాపు రూ.45 కోట్ల మేరకు రైతులకు చెందాల్సిన సొత్తు వ్యాపారులు, సీసీఐ ప్రతినిధుల జేబుల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు సీసీఐ 15 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో 6.80 లక్షల క్వింటాళ్లు, నేలకొండపల్లి మార్కెట్ పరిధిలో 1.60 లక్షలు, భద్రాచలం మార్కెట్ పరిధిలో 1.60 లక్షలు, ఏన్కూరులో 1.60 లక్షలు, కొత్తగూడెం, చండ్రుగొండ మార్కెట్‌ల పరిధిలో 1.60 లక్షలు, మధిర మార్కెట్ పరిధిలో 55 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. మొత్తంగా సుమారు 15 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరుగుగా దీనిలో దాదాపు 10 లక్షల క్వింటాళ్ల పత్తి రైతుల పేరిట వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో అమ్మారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 5 లక్షల క్వింటాళ్ల పత్తిని మాత్రమే రైతులు నేరుగా సీసీఐ కేంద్రాల్లో అమ్మి ఉంటారని రైతు ప్రతినిధులు అంచనాలు వేస్తున్నారు. గత నెల నుంచి మార్కెట్‌లలో ఏర్పాటు చేసిన కేంద్రాలతో పాటు జిల్లాలోని కూసుమంచి, తల్లాడ, ముదిగొండ మండలాల్లో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో కూడా నేరుగా అమ్ముకునే విధంగా అవకాశాన్ని కల్పించారు. ఈ అనుమతి వ్యాపారులకు బాగా కలిసివచ్చింది. ఈ మిల్లులతో సంబంధాలున్న వ్యాపారులకు ఇంకా బాగా కలిసి వస్తోంది. వ్యాపారులు ఏ ధరకు కొనుగోలు చేసినా సీసీఐ నిర్వాహకులకు క్వింటాలుకు రూ.50 చొప్పున ముట్టజెప్పి తమ సరుకు ప్రభుత్వ మద్దతు ధరను పొందుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొందరు బడా వ్యాపారులు ఈ వ్యవహారాన్ని భారీ ఎత్తున చేస్తున్నట్లు వినవస్తోంది. కొందరు అప్పుల ఊబిల కూరుకుపోయిన వ్యాపారులకు ఈ ఏడాది ఈ అక్రమం వ్యవహారం కలిసి వచ్చి అప్పులు తీరినట్లు కూడా చర్చ జరుగుతోంది. మొత్తంగా ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలు వ్యాపారులు, సీసీఐ ప్రతినిధులకు వరంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపిస్తే అక్రమం అంతా బయటకు వస్తుంది. తక్కువ భూమి కలిగిన రైతులు వందల క్వింటాళ్లలో పత్తిని పండించి సీసీఐ కేంద్రాల్లో అమ్మకాలు జరిపినట్లు రికార్డులు చెబుతున్నాయి. అది ఎలా సాధ్యం అని చూస్తే అక్రమం అంతా బయటకు వస్తుంది.
ప్రభుత్వ ఆదాయూనికి గండి
సీపీఐ అధికారులు, వ్యాపారుల కుమ్మక్కు కేవలం రైతులను మోసం చేయడానికే పరిమితం కాకుండా ప్రభుత్వ ఆదాయూనికి కూడా గండి పడుతోంది. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల పరిధిలో మొత్తం 15 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ, 2.5 లక్షల క్వింటాళ్లు వ్యాపారులు కోనుగోలు చేసినట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వ్యాపారులు గ్రామాలు, మార్కెట్లలో రైతుల వద్ద నుండి పత్తిని కొనుగోలు చేశారు. వారికి తెలిసిన రైతుల పేర్లతో సీసీఐకి అమ్మకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసే పత్తికి ఒక శాతం ప్రభుత్వానికి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కు కావడంతో ఈ ఒక్కశాతం సెస్‌కు కూడా గండిపడింది. జిల్లాలో మొత్తం 10 లక్షల క్వింటాళ్ల మేరకు పత్తికొనుగోళ్లు చేసి.. సుమారు రూ. 3.5 కోట్ల మేరకు మార్కెట్‌లకు రావాల్సిన ఆదాయానికి గండిపెట్టారనే ఆరోపణలు వస్తున్నారుు.
ఆ ఇద్దరు ఒక్కటై.. అవినీతి ‘ఛీఛీ..ఐ’!
Published Wed, Feb 18 2015 2:58 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement