సాక్షి, జనగామ:ముందస్తు ఎన్నికల్లో కోవర్టుల వ్యవహారం నేతలకు తలనొప్పిగా మారింది. అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ రోజు వెంట నడుస్తున్న నాయకులు, కార్యకర్తలు గంటల వ్యవధిలోనే వేరే పార్టీలో చేరుతుండడంతో అభ్యర్థుల గుండెల్లో గుబులు పెడుతోంది. ఇదిలా ఉంటే వెంట ఉన్నట్టే నటన చేస్తూ కోవర్టులుగా వ్యవహరిస్తూ.. ఇక్కడి, అక్కడి సమాచారాలను ప్రత్యర్థులకు చేరవేస్తూ.. అభ్యర్థులకు హార్ట్‌ఎటాక్ తెప్పించేంత పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీల్లో ఉన్న అభ్యర్థులకు కోవర్టుల బెడద తప్పడం లేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
స్థిరత్వం లేకుండా ప్రలోభాలకు లొంగి పార్టీలు ఫిరాయిస్తున్న వారితో పాటు ప్రస్తుతం పార్టీలోనే కొనసాగుతూ.. అక్కడి సమాచారాన్ని ప్రత్యర్థి శిబిరానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ కొందరు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచర గణంతో చర్చించి ఏ గ్రామంలో ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలని, ఎవరిని ప్రలోభాలకు గురిచేస్తే తమకు లాభం చేకూరుతుంది అనే అంశాలపై చర్చించుకుంటున్నట్లు వినికిడి. మద్యం, విందులు పంపిణీపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చల్లోనే ఉన్న కోవర్టులు సమయం చూసుకుని, తమ ప్రత్యర్థి శిబిరాలకు సమాచారాన్ని అందిస్తున్నారు.
దీంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్న అభ్యర్థి కంటే ముందుగానే ప్రత్యర్థి నేతలు వెళ్లి, అక్కడి వ్యవహారాలను చక్కబెడుతూ.. వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని కోపతాపాల మీద ఉంటున్నారని రాజకీయ పార్టీల విశ్లేషణ. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ఉన్న కొద్ది రోజులను సద్వినియోగం చేసుకుని, గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించాలనుకుంటున్న అభ్యర్థులు కోవర్టులపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. గోడదూకే ప్రయత్నం చేస్తున్న నాయకులు.. కార్యకర్తలను బుజ్జగించి పార్టీ ఫిరాయింపులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కులసంఘాల ప్రతినిధులు ఇరువర్గాల వారిని కలిసి లాభపడాలనే ఆలోచనతో వస్తే.. ఇలాంటి వారిని కూడా గుర్తించడానికి కోవర్టులు ఉపయోగపడుతున్నారు. కోవర్టులు..ఫిరాయింపులతో అభ్యర్థులకు కంటి నిండా నిద్ర కూడా పట్టే పరిస్థితి లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment