సాక్షి, కరీంనగర్ : శాతవాహన యూనివర్శిటీలోని తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) పై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. పోలీసులే తమపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నట్లుగా టీవీవీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. టీవీవీకి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు గతంలో చాలా సార్లు రుజువైందని చెప్పారు. టీవీవీలో పనిచేసే కొంతమంది నేతలు తరుచూ చత్తీస్‌గఢ్ వెళ్లి మావోయిస్టు నేతలను కలుస్తున్నట్లుగా మా దగ్గర సమాచారం ఉందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు పోలీసు స్టేషన్లలో మావోయిస్టులతో సంబంధాలున్నట్లు టీవీవీ నేతలపై కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అమాయక విద్యార్థులకు మాయమాటలు చెప్పి మావోయిస్టు అజ్ఞాత దళంలో చేర్పించేందుకు టీవీవీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
(చదవండి : చదువులమ్మ ఒడిలో ‘మావో’ల కలకలం!)
టీవీవీ రాష్ట్రాధ్యక్షుడు మహేశ్ వద్ద గతంలో విప్లవ సాహిత్యం దొరికిందని గుర్తు చేశారు. అతనిపై నల్గొండ జిల్లాలో పోలీసు కేసు నమోదైందని చెప్పారు. శాతవాహన యూనివర్శిటీలోని టీవీవీ నేతలపై సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై నిజనిజాలు ఇంకా ధ్రువీకరణ కాలేదని ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. యూనివర్శిటీ ప్రొఫెసర్ పై వచ్చిన ఆరోపణలపై మాదగ్గర ఆధారాలు లేవని స్పష్టం చేశారు. నక్సల్స్ బాధితుల సంక్షేమం సంఘం పేరుతో సర్క్యులేట్ అవుతోన్న పోస్టులను ఎవరు చేశారో గుర్తిస్తామని చెప్పారు. యూనివర్శిటీలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మావోయిజం వల్ల గడిచిన మూడు దశాబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది చనిపోయారని, ప్రభుత్వం, పోలీసులు తీసుకున్న కఠిన చర్యల వల్ల మావోయిజాన్ని ఇక్కడ లేకుండా చేయగలిగామని సీపీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment