రాష్ట్ర విభజన నేపథ్యంలో కొంతకాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్న సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతలు గురువారమిక్కడ భేటీ అవుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కొంతకాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్న సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతలు గురువారమిక్కడ భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో సీపీఎంతో కలసి పనిచేసే పరిస్థితి లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి న్యూఢిల్లీలో ప్రకటించి 48 గంటలు దాటక మునుపే ఉభయ పార్టీల నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడ నగర కార్పొరేషన్‌లో సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా పోటీ చేస్తున్నందున మిగతా నగరాలు, పట్టణాల్లో కూడా కలసి బరిలోకి దిగే ప్రతిపాదనపై ఉభయ పార్టీల నేతలు దృష్టి సారించారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సీపీఐ ప్రయత్నిస్తుండగా, సీపీఎం ఉభయ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ సహా ఇతర భావసారూప్యత ఉన్న పార్టీలతో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సమావేశంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సర్దుబాట్ల విషయాన్నీ చర్చిస్తారని సమాచారం. ఈ భేటీకి సీపీఎం తరఫున తమ్మినేని వీరభద్రం, పి.మధుతోపాటు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు తదితరులు... సీపీఐ తరఫున పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, కె.రామకృష్ణ, చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, గుండా మల్లేష్ తదితరులు హాజరవుతున్నారు.
చంద్రావతికి టిక్కెట్ ఇవ్వలేం...
సీపీఐ వైరా ఎమ్మెల్యే బి.చంద్రావతి తన నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారని, పార్టీ కార్యకర్తలను సైతం కలుపుకుని పోలేకపోయారని ఖమ్మం జిల్లా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. సీపీఐ నిర్ణయంతో ఖిన్నురాలయిన చంద్రావతి టీడీపీలో చేరడానికి సిద్ధపడ్డారు. దీంతో పార్టీ కార్యదర్శి నారాయణ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు.