సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఒక వెలుగు వెలిగిన వామపక్షాల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. సుదీర్ఘకాలం పాటు జిల్లా రాజకీయాల్లో తమదైన శైలిలో విశిష్ట పాత్ర పోషించిన వామపక్షాలు... తాజాగా వెలువడిన సార్వత్రిక ఫలితాల అనంతరం కుదేలైపోయాయి. జిల్లాలోని ప్రధాన వామపక్షాలైన సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ)లలో ఒక్క సీపీఎంకు మాత్రమే కేవలం ఒక అసెంబ్లీ స్థానం దక్కగా, మిగిలిన రెండు పార్టీలు తెలంగాణ నూతన అసెంబ్లీలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కోల్పోయాయి.
క్షేత్రస్థాయిలో బలం చెదురుతోందా?
దశాబ్దాల రాజకీయ పరిణామాలను గమనిస్తే... వామపక్షాలకు పుట్టినిల్లయిన ఖమ్మం జిల్లాలో కామ్రేడ్లు క్రమేపీ పట్టు కోల్పోతున్నారనే చర్చ నడుస్తోంది. వామపక్షాల బలాన్ని గుర్తించేందుకు ఎన్నికలే ప్రాతిపదికగా అంచనా వేసే పరిస్థితి లేకపోయినా... క్షేత్రస్థాయిలో కూడా ఆ పార్టీల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందనే వాదన వినబడుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో ఒకప్పుడు ఈ మూడు పార్టీలలో ఏదో ఒక పార్టీ బలంగా ఉండేది. కొన్ని చోట్ల అయితే రెండు పార్టీలు బలంగా ఉండి వారిద్దరే ఆధిపత్యం కోసం పోరాటం చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
మూడు పార్టీలు మూడు నియోజకవర్గాల్లో మాత్రమే ఉనికిని చాటుకోగలిగాయి. మిగిలిన చోట్ల రెండు, మూడు మండలాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో అసలు జిల్లాలోని మూడు ప్రధాన వామపక్షాల భవిష్యత్తుపై కేడర్‌లో భరోసా లేకుండా పోతోంది. ప్రజాసమస్యల పరిష్కారంలో తమ పాత్ర ఎలా ఉంటుందో అంతుపట్టడం లేదని, ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలోని కామ్రేడ్లను మళ్లీ గాడిలో పెట్టడం ఎలా అనేది అర్థం కావడం లేదని జిల్లాకు చెందిన ఓ ముఖ్య కమ్యూనిస్టు నాయకుడే వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది.
మార్క్సిస్టుల బలం ఏమైంది?
ముఖ్యంగా ఖమ్మం పరిసరాలు, భద్రాచలం ఏజెన్సీలో బలంగా ఉండే సీపీఎం ఇప్పుడు రెండు చోట్లా పట్టుకోల్పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భద్రాచలంలో వైఎస్సార్‌సీపీతో అవగాహనతో పాటు అక్కడి కాంగ్రెస్, టీడీపీల్లో నెలకొన్న వర్గ విభేదాలు సీపీఎంకు విజయాన్ని చేకూర్చాయి. వాస్తవానికి అసెంబ్లీ కౌంటింగ్‌లో ఒక సమయంలో సీపీఎం దా దాపు పరాజయం అంచున నిల్చుంది. అయి తే, వెంకటాపురం, చింతూరు మండలాల్లో పెద్ద ఎత్తున ఆధిక్యం సంపాదించి అత్తెసరు మెజార్టీతో గెలుపొందింది. స్థానిక ఎన్నికల ఫలితాల్లోనూ సీపీఎం ఆశించినన్ని స్థానాలు పొందలేకపోయింది.
మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో 97 వార్డులకు ఎన్నికలు జరిగితే మధిర మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో మాత్రమే సీపీఎం గెలుపొందింది. ఇక జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి కేవలం రెండు జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలే దక్కాయి. ఈ పరిస్థితుల్లో సీపీఎం మళ్లీ పుంజుకుంటుందా అనేది జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. అయితే, ఆ పార్టీ తెలంగాణ సారథ్య బాధ్యతలు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుడు తమ్మినేని వీరభద్రానికి దక్కిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పోషించే నూతన పాత్ర, నిర్మించే ప్రజా ఉద్యమాలను బట్టి పార్టీ భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే, ప్రస్తుతానికి మాత్రం పార్టీ నాయకత్వం పూర్తిగా మేధోమథనంలో పడి, పార్టీ పరాజయానికి కారణాలు వెతుక్కునే పనిలో ఉంది.
సీపీఐకి కష్టకాలం
ఇక, జిల్లాలో మరో ప్రధాన వామపక్షమైన సీపీఐకి కూడా తాజా ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. గత శాసనసభలో జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుండగా, ఇప్పుడు అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకోగా, స్వయంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్. కె. నారాయణ ఖమ్మం ఎంపీ బరిలో నిలిచినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రాలేదు. ఆయనతో పాటు జిల్లాలో ఆ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులంతా ఓటమిపాలు కావడం పార్టీ నాయకత్వంతో పాటు కేడర్‌ను కూడా నైరాశ్యంలో ముంచింది.
ఇక స్థానిక సంస్థల విషయానికి వస్తే ఆ పార్టీకి 13 మున్సిపల్‌వార్డులు, ఒక జెడ్పీటీసీ, 43 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే లభించాయి. సార్వత్రిక పరాజ యంతో పాటు మున్సిపల్, పరిషత్ ఎన్నికలో ్లనూ నామమాత్రపు ఫలితాలే సాధించడంతో సీపీఐ భవిష్యత్తుపై ఆ పార్టీ సానుభూతిపరు లు, కార్యకర్తల్లో బెంగ నెలకొంది. ప్రత్యేక తె లంగాణ వాదాన్ని భుజానెత్తుకున్నా ఫలితం లేకపోవడంతో ఇప్పుడేం చేయాలన్న దానిపై పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది.
ఆశించిన ఫలితం లేని ఎన్డీ
సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) విషయానికి వస్తే ఆ పార్టీ రెండు వర్గాలుగా ఎన్నికలకు ముందే చీలిపోయింది. రాయల, చంద్రన్న వర్గాలుగా ఎన్నికల బరిలో నిలిచాయి పార్టీ శ్రేణులు. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీచేసినా కేవలం ఒక్క ఇల్లెందు అసెంబ్లీనే టార్గెట్‌గా పనిచేశాయి. కానీ ఎక్కడా అనుకూల ఫలితం రాలేదు. ఇక పరిషత్ ఎన్నికలలో మాత్రం పార్టీ పట్టున్న చోట సత్తా చాటింది . ఇల్లెందు నియోజకవర్గంతో పాటు గుండాల మండలంలో మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 3 జెడ్పీటీసీలతో పాటు 30 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే కేవలం ఇల్లెందులో మాత్రమే చెరో వర్గం... ఒక్కో కౌన్సిలర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. మొత్తంగా ఆశించిన ఫలితాలు రాని పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎలా నెగ్గుకురావాలన్నది ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వం ముందున్న ప్రశ్న.
వామపక్షాల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది
Published Tue, May 27 2014 1:51 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement