కేసీఆర్ పిచ్చోడిలా మారుతున్నారు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రోజురోజుకు పిచ్చోడిలా మారుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి విమర్శించారు. కమ్యూనిస్టు సిద్ధాంతం కాలం చెల్లిందనే వాదన సరికాదని అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాల చుట్టూ కేసీఆర్ తిరిగారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా సీపీఐ నిర్ణయం తీసుకున్న తరువాతే ఉద్యమానికి ఊపొచ్చిందని చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. 'కొరివి వీరభద్ర స్వామి మీసాలు పెట్టిన తరువాతే కేసీఆర్‌కు మీసాలొచ్చినట్టు మాట్లాడుతున్నారు. యజ్ఞయాగాలు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. సురవరం మీద విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఇందిరా పార్కు వద్ద ధర్నాలు ఉండవన్నారు. ఇప్పుడు ధర్నాలతో ఇందిరా పార్కు దద్దరిల్లుతోంది. కోదండరాం టీజేఏసీని నిష్పక్షపాతంగా నడిపిస్తున్నారు. ఆయన కేసీఆర్‌కు లొంగలేదు. ఆయనకు పదవులపై మోజు లేని వ్యక్తి. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని ఎండగడతాం. కేసీఆర్ కావాలని కమ్యూనిస్టులతో పెట్టుకుంటున్నారు. ఆయనకాయనే భూస్థాపితం చేసుకుంటున్నారు' అని చాడా వెంకటరెడ్డి అన్నారు.