
హైకోర్టు చెప్పినా చర్చలకు పిలవకుండా 48 వేల ఆర్టీసీ కుటుంబాలను బజారుపాలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. ఆర్టీసీ జేఏసీ తీసుకున్న కార్యాచరణకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బంద్‌లో పాల్గొన్న సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు గాయానికి కారణమైనవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు చెప్పినా చర్చలకు పిలవకుండా 48 వేల ఆర్టీసీ కుటుంబాలను బజారుపాలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. ఆర్టీసీ జేఏసీ తీసుకున్న కార్యాచరణకు మా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..
జేఏసీ నిర్ణయించిన అన్ని అంశాలను లెఫ్ట్ పార్టీలు ఆమోదిస్తున్నాయన్నారు. రాష్ట్ర చరిత్రలోనే తెలంగాణ బంద్ 100 శాతం విజయవంతంగా జరిగిందన్నారు. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని ఘాటుగా విమర్శించారు. కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఇంతవరకూ సీఎం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ మొండి వైఖరి వీడి కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
వామపక్ష పార్టీల కార్యాచరణ..
- 21న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతోపాటు వామపక్ష పార్టీల కుటుంబాల డిపోల ముందు నిరసన
- 22న తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లోకి రావద్దని విజ్ఞప్తి
- 23న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి సమ్మెకు మద్దతు కోసం విజ్ఞప్తి
- 24న మహిళా కండక్టర్ల దీక్షలు. వారితో పాటు సాధారణ మహిళల్ని కూడా నిరననల్లో భాగం చేస్తాం
- 25న మిలిటెంట్ కార్యక్రమం ద్వారా జాతీయ రహదారుల దిగ్భంధం
- 26న ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష. వారితోపాటు వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తల పిల్లలు కూడా దీక్షల్లో భాగం చేస్తాం
- 27న వామపక్ష పార్టీ నాయకుల ఇళ్లకు ఆర్టీసీ కార్మికులకు ఆహ్వానం