ఆదివారం ఢిల్లీలో జరిగిన జాతీయ ఓబీసీ జేఏసీ సమావేశంలో పాల్గొన్న జస్టిస్ ఈశ్వరయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో పనిచేస్తున్న బీసీ సంఘాలను ఒకే గొడు గు కిందకు తెస్తూ జాతీయ బీసీ ఫెడరేషన్ ఆవిర్భవించింది. ఆదివారం ఢిల్లీలో జాతీయ ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ నుంచి బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు, అన్ని రాష్ట్రాల నుంచి ఓబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల బీసీ సంఘాలను కలిపి ఒకే ఫెడరేషన్‌ను ఏర్పాటుచేశారు. దీనికి జాతీయ చైర్మన్‌గా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రిజర్వేషన్లు దక్కేవరకు పోరాటం..
ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణను శాస్త్రీయంగా చేపట్టాలని, బీసీ ఓటర్ల గణన శాస్త్రీయంగా జరగలేదని, సమగ్ర కుటుంబ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్ ఎత్తేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని, కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.50 వేల కోట్లు కేటాయించాలని, ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని పలు తీర్మానాలు చేశారు.
ఓబీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమానత్వం కల్పించి ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన భాగం ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల డిమాండ్ల సాధనకై వచ్చే నెలలో లక్ష మందితో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment