సదస్సులో ప్రసంగిస్తున్న జస్టిస్ వి.ఈశ్వరయ్య. చిత్రంలో మాజీ ఎమ్మెల్సీ వెంకయ్య, బీసీ సంఘం నేతలు దువ్వారపు రామారావు, ఎంవీవీఎస్ మూర్తి తదితరులు
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో 75 శాతానికి పైగా ఉన్న బీసీలు ఎవరికి వారే పోరాడుతుండటం వల్ల అభివృద్ధి ఫలాలు దక్కడం లేదు. బీసీలంతా సంఘటితమైతేనే ప్రజాస్వామ్య ఫలితాలు లభిస్తాయి. చట్టసభల్లో రిజర్వేషన్లతోనే బీసీల అభ్యున్నతి సాధ్యం’ అని అఖిల భారత బీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు జస్టిస్ వి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. బీసీ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య అధ్యక్షతన ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా వెనుబడిన వర్గాలు నేటికీ అభివృద్ధి చెందలేదన్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే విలువలతో కూడిన సమసమాజ స్థాపన కోసం.. దేశంలోని అన్ని రంగాల్లోనూ బీసీలకు తగినంత ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సమాఖ్య రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తోందన్నారు. వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభించాలన్న లక్ష్యంతో ‘పీపుల్స్ అజెండా–2019’కు రూపకల్పన చేశామని, ఓటుతోనే ఈ అజెండా అమలు సాధ్యమవుతుందన్నారు. ప్రాథమిక విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాలని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న నీరు, భూమి, అటవీ వనరులపై వారికే పూర్తి హక్కులు కల్పించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ పెట్టుబడులు ప్రభుత్వమే భరించాలని జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
అనంతరం బీసీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ ముద్రించిన కరపత్రాలను జస్టిస్ ఈశ్వరయ్య విడుదల చేశారు. సమావేశంలో నాయకులు దువ్వారపు రామారావు, ఎంవీవీఎస్ మూర్తి, వై.కోటేశ్వరరావు, గూడూరి వెంకటేశ్వరరావు, కె.ఆల్మన్ రాజు, నమి అప్పారవు, వి.వి.గిరి, ఎన్.వి.రావు, బుద్దా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్ ఈశ్వరయ్య ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment