రెండోసారి పట్టుబడితే క్రిమినల్ కేసు
యాలాల: ఇసుక అక్రమ రవాణా చేస్తూ రెండో సారి పట్టుబడితే వాహన యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు సబ్‌కలెక్టర్ హరినారాయణ్ హెచ్చరించారు. మంగళవారం ఆహార భద్రత కార్డులు, పింఛన్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాలాల తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మండల పరిధితో పాటు తాండూరు కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణకు అడ్డు అదుపులేకుండా పోతోందన్నారు.
అక్రమార్కుల చర్యలకు కళ్లెం వేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ముందుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా ఎస్పీ రాజకుమారితో చర్చించామన్నారు. ఇసుక అక్రమ రవాణ చేస్తూ మొదటిసారి పట్టుబడిన వాహన యజమానికి జరిమానా విధిస్తామని, అదే వాహనం రెండో సారి పట్టుబడితే యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. మండల పరిధితోపాటు తాండూరు, బషీరాబాద్ మండల పరిధిలోని కాగ్నా నది నుంచి ఇసుక తరలింపునకు ప్రభుత్వపరంగా ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే పలు వాహనాలకు నెంబర్లు లేని విషయాన్ని సబ్‌కలెక్టర్ దృష్టికి స్థానికులు తేగా జిల్లా రవాణా అధికారితో చర్చించి, అటువంటి వాహనాలు దొరికితే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఆధార్ సీడింగ్ చేయకున్నా రేషన్ యథాతథం
ఆధార్ సీడింగ్ చేయని వారికి రేషన్ కోటా కట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు. ఆధార్ సీడింగ్ చేసుకున్నా, చేసుకోకపోయినా రేషన్ సరఫరా యథాతథంగా జరుగుతుందని సబ్‌కలెక్టర్ వివరించారు. అనంతరం బాణాపూర్‌లో దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు యాలాల తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ షౌకత్ అలీ తదితరులు ఉన్నారు.