మంగళవారం అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి, అధికారులు
సాక్షి, హైదరాబాద్: కాలుష్యాన్ని వ్యాపింపచేస్తూ, ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పరిశ్రమలు, ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. కాలుష్యాన్ని వెదజల్లుతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇలాంటి పరిశ్రమలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం అరణ్యభవన్‌లో వివిధ విభాగాలపై మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా, అటవీ అభివృద్ధిసంస్థ వైస్ చైర్మన్, ఎండీ రఘువీర్, పీసీబీ మెంబర్ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, ఈపీటీఆర్‌ఐ ఎండీ కల్యాణ చక్రవర్తి, బయో డైవర్సిటీ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శిల్పి శర్మ, టీఎస్ కాస్ట్ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో కాలుష్యం కోరలు చాస్తోందని, తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.
ప్లాస్టిక్ వినియోగానికి చెక్...
రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కూడా ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి చెప్పారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్, క్లాత్ బ్యాగులను వాడేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం ఉన్నా, కంపెనీలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ బ్యాగులను తయారు చేస్తున్నాయని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కాలం చెల్లిన వాహనాలకు చెక్..
కాలం చెల్లిన వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాల కారణంగా స్వచ్ఛమైన గాలి కలుషితమవుతోందని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కాలం తీరిన వాహనాలకు చెల్లు చీటీ పాడాలని మంత్రి సూచించారు. కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టేందుకు నిరంతరం కాలుష్య ప్రమాణ తనిఖీలు నిర్వహించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చే విధంగా ఈపీటీఆర్‌ఐ పరిశోధనలు చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment