సంక్షోభం! | crisis Sirisilla the textile industry | Sakshi
Sakshi News home page

సంక్షోభం!

Published Thu, Apr 7 2016 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

సంక్షోభం!

సంక్షోభం!

సంక్షోభంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమ
యాభై మందికిపైగా దివాళా తీసిన వ్యాపారులు  
పేరుకుపోయిన కోటి  మీటర్ల వస్త్రం
సర్కారు పైనే భారం

 
 సిరిసిల్ల : ‘సిరి’శాలగా పేరున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వస్త్రాన్ని నమ్ముకున్న వ్యాపారులు గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నారు. వస్త్రం ఉత్పత్తి వ్యయానికి, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసం ఉండడం, కొంతమంది బడా వ్యాపారుల చేతుల్లో వస్త్రవ్యాపారం బందీకావడం, గుత్తాధిపత్యం కోసం పథకం ప్రకారం చిన్న వ్యాపారులను  దెబ్బతీయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారం మందగిస్తూ పలువురు వ్యాపారులు దివాళా తీస్తున్నారు. సిరిసిల్లలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా 34 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం, ఏడువేల మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది.

ఒక్కో మగ్గంపై నిత్యం వంద మీటర్ల పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి జరుగుతుంది. నిత్యం 27లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తి అవుతుంది. పాలిస్టర్ వస్త్రానికి వినియోగించే నూలు కిలో ధర రూ.102 ఉంది. ఇరవై రోజుల కిందట కిలో ధర రూ.92 ఉంది. ప్రతి కిలో నూలుకు రూ.10 ధర పెరగ్గా ఉత్పత్తి అయిన వస్త్రానికి ఆ మేరకు ధర పెరగడం లేదు. మీటరు పాలిస్టర్ వస్త్రాన్ని సిరిసిల్ల మగ్గాలపై ఉత్పత్తి చేసేందుకు రూ.7.30 ఖర్చు అవుతుంది. కానీ మీటరు వస్త్రానికి రూ.6.70 ధర లభిస్తుంది. ప్రతి మీటర్ వస్త్రంపై వ్యాపారులు 60పైసలు నష్టాలను చవిచూస్తున్నారు. బట్టకు ధరలేదని అమ్మడం ఆపేయడంతో సిరిసిల్లలో వస్త్రం నిల్వ లు పేరుకుపోతున్నాయి.

ప్రస్తుతం సిరిసిల్లలో కోటి మీటర్ల వస్త్రం నిల్వలున్నాయి. సిరిసిల్లకు నూలు సరఫరా చేసే హైదరాబాద్ పెద్ద సేట్లే మళ్లీ వస్త్రం కొనుగోలు చేస్తున్నారు. సిరిసిల్లకు నూలు ఇవ్వడం, గుడ్డ కొనడం వారిచేతుల్లోనే ఉంది. దీంతో పెద్ద సేట్ల కనుసన్నల్లోనే సిరిసిల్ల వస్త్ర వ్యాపారం ఆధారపడి ఉంది. యాభై మంది హైదరాబాద్ సేట్లు సిరిసిల్లను గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. నిజానికి ఇతర ప్రాంతాల్లోనూ పాలిస్టర్ వస్త్రానికి ధర లేకపోవడంతో అనివార్యంగా సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు హైదరాబాద్ సేట్లకు బట్ట ఇవ్వాల్సి వస్తుంది. దీంతో నష్టాలను మూటగట్టుకుంటున్నారు.


 దివాళా తీసిన వ్యాపారులు
సిరిసిల్లలో ఎంతో నమ్మకంగా వస్త్ర వ్యాపారం సాగిస్తున్న పలువురు వ్యాపారులు ప్రస్తుతం దివాళా తీసినట్లు చర్చసాగుతోంది. మంత్రి రవీందర్ వాట్సప్ మెసేజ్ ఉదంతంతో దివాళా వ్యాపారుల దైన్యస్థితి వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది మధ్య తరగతి వ్యాపారులు పాలిస్టర్ వ్యాపారం చేయలేక ఇబ్బం దులు పడుతున్నారు. సిరిసిల్లలో పెద్ద సేట్లుగా పేరున్న ఓ నలుగురు వ్యాపారులు చిన్న వ్యాపారులను పూర్తిగా ఇబ్బంది పెట్టేందుకు వస్త్రం ధరలను మరింత తగ్గించి, ఆసాములకు ఇచ్చే కూలిని తగ్గిస్తూ.. చిన్న వ్యాపారులను మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారనే ఆరోపణలున్నాయి.

భవిష్యత్‌లో పోటీ లేకుండా చేసుకునే లక్ష్యంతో సిరిసిల్ల పెద్దసేట్లు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు సమాచారం. సిరిసిల్లలోని వ్యాపారులకు హైదరాబాద్ సేట్లు నూలు ఇవ్వకుండా అడ్డుపడుతూ అపనమ్మకాన్ని కలిగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ వ్యాపారులు సైతం గతంలో నూలు ఉద్దెర ఇస్తూ.. నెల రోజులకు డబ్బులు తీసుకునే వారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారం రోజుల్లో డబ్బులిస్తేనే నూలు ఇస్తాం... గుడ్డ అమ్మినా.. అమ్మకపోయినా డబ్బులిస్తామంటేనే  పాలి స్టర్ నూలు ఇస్తామని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. దీంతో నష్టపోయిన సిరిసిల్ల వ్యాపారులు అప్పుల వేటలో పడగా కొత్తగా అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. గుడ్డ అమ్మక, నూలు నమ్మక వస్త్రవ్యాపారం సంక్షోభం ఉంది. ఇప్పటికిప్పుడు యాభై మంది వస్త్ర వ్యాపారులు నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో సిరిసిల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు కరువు పరిస్థితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం క్షీణించడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీని ప్రభావం సిరిసిల్లలోని ఇతర రంగాల్లోనూ ప్రబలంగా ఉంది.

 
 ప్రత్యామ్నాయం ఏమిటి..?

సిరిసిల్లలో ఇప్పుడున్న మరమగ్గాలపై అనేక రకాల వస్త్రాలను ఉత్పత్తి చేయవచ్చు.
మార్కెట్‌లో డిమాండ్ లేని పాలిస్టర్‌ను వదిలిపెట్టి, డిమాండ్ ఉన్న వస్త్రాలను ఉత్పత్తి చేయాలి.
కొద్ది మంది వస్త్రవ్యాపారులు డిమాండ్ ఉన్న వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ.. సంక్షోభాలకు దూరంగా ఉంటూ ఆర్థికంగా స్థిరపడ్డారు.
  హైదరాబాద్‌లోని బడా సేట్లపై ఆధారపడకుండా సొంతగా బ్యాంకు రుణాలు పొంది పెట్టుబడులు సమకూర్చుకోవాలి.
సిరిసిల్లలో ముద్రవంటి పథకాల్లో రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే కొద్ది మంది ప్రయోగాలను చేస్తూ నమ్మకమైన ఉపాధి పొందుతున్నారు.
చేనేత, జౌళిశాఖ అధికారులను సంప్రదించి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న వస్త్ర వివరాలను సేకరించాలి.
సిరిసిల్ల మరమగ్గాలపై పట్టు వస్త్రాలను ఉత్పత్తి చేసే నైపుణ్యం కార్మికుల్లో ఉంది.
సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్‌ని సృష్టిస్తేనే ఆర్థిక సంక్షోభాలను అధిగమించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement