polyester cloth
-
ఆర్ఐఎల్ చేతికి శుభలక్ష్మీ పాలి
న్యూఢిల్లీ: పాలియెస్టర్ చిప్స్, యార్న్ తయారీ కంపెనీ శుభలక్ష్మీ పాలియెస్టర్స్(ఎస్పీఎల్)ను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ రిలయన్స్ పాలియెస్టర్ లిమిటెడ్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా శుభలక్ష్మీ పాలియెస్టర్స్, శుభలక్ష్మీ పాలిటెక్స్ లిమిటెడ్‌కు చెందిన పాలియెస్టర్ బిజినెస్‌లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వీటికి రూ. 1,522 కోట్లు, రూ. 70 కోట్లు చొప్పున చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)తోపాటు రెండు సంస్థల రుణదాతల నుంచి అనుమతులు లభించవలసి ఉన్నట్లు పేర్కొంది. తాజా కొనుగోలు ద్వారా టెక్స్టైల్ తయారీ బిజినెస్ మరింత పటిష్టంకానున్నట్లు తెలియజేసింది. ఎస్పీఎల్ పాలియెస్టర్ ఫైబర్, యార్స్, టెక్స్టైల్ గ్రేడ్ చిప్స్ తయారు చేస్తోంది. ఏడాదికి 2,52,000 టన్నుల పాలిమరైజేషన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ గుజరాత్‌లోని దహేజ్, దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఇదీ చదవండి: ఐటీ జాబ్ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకండి! -
దేశం కోసం ఖాదీ... జాతీయ జెండా కోసం చైనీస్ పాలిస్టర్
న్యూఢిల్లీ: దేశం కోసం ఖాదీ కానీ జాతీయ జెండా కోసం చైనీస్ పాలిస్టర్ అని కాంగ్రెస్ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎప్పటిలాగే ఆయన పనులుకు మాటలకు పొంతన ఉండదంటూ మోదీ పై మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీ అహ్మదా బాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ లో ఖాదీ ఉత్తవం సందర్భంగా ఖాదీ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ మోదీ పై ఈ విమర్శల దాడి చేశారు. మోదీ ఆ ఉత్సవంలో అభివృద్ధి చెందిన స్వావలంబనతో కూడిన భారతదేశ కలను సాధించడానికి ఖాదీ ఒక ప్రేరణగా మారుతుందని అన్నారు. దీందో రాహుల్‌గాంధీ ఫ్లాగ్ కోడ్ విషయాన్ని ప్రస్తావిస్తూ ...కేంద్రం ఫ్లాగ్ కోడ్‌ని సవరించడాన్ని కూడా తప్పుపట్టారు. జాతీయ జెండాను చేతితో చేసే నూలు లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి /పాలిస్టర్/ ఉన్ని/ పట్టు ఖాదీని వినియోగించవచ్చని కేంద్రం సవరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే గతంలో మిషన్‌తో చేసే పాలిస్టర్ జెండాలను ఉపయోగించేందుకు అనుమతించలేదనే విషయాన్ని గుర్తు చేశారు. పైగా మోదీ ఆ ఖాదీ ఉత్సవంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఖాదీ లేదా హోమ్‌స్పన్ నాసిరంకంగా ఉత్పత్తిగా పరిగణించారని చెప్పారు. అంతేకాదు రానున్న పండుగలో గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులైన ఖాదీ మాత్రమే బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు కూడా. దీంతో రాహుల్ గాంధీ మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. (చదవండి: స్వావలంబనకు స్ఫూర్తి ఖాదీ) -
పాలిస్టర్ జాతీయ జెండా అమ్మకాలపై జీఎస్టీ మినహాయింపు
న్యూఢిల్లీ: పాలిస్టర్ లేదా యంత్రంపై తయారైన భారత జాతీయ జెండా అమ్మకంపైనా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపు లభించనుంది. ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. చేతితో నేసిన లేదా అల్లిన పత్తి, పట్టు, ఉన్ని లేదా ఖాదీ జాతీయ జెండాలు ఇప్పటికే జీఎస్టీ నుండి మినహాయింపు పొందుతున్నాయి. అయితే పాలిస్టర్, యంత్రంపై తయారైన జాతీయ పతాకాన్నీ జీఎస్టీ నుంచి తాజాగా మినహాయిస్తున్నట్లు తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి తాజా వివరణ వెలువడింది. -
సంక్షోభం!
► సంక్షోభంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమ ► యాభై మందికిపైగా దివాళా తీసిన వ్యాపారులు ► పేరుకుపోయిన కోటి మీటర్ల వస్త్రం ► సర్కారు పైనే భారం సిరిసిల్ల : ‘సిరి’శాలగా పేరున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వస్త్రాన్ని నమ్ముకున్న వ్యాపారులు గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నారు. వస్త్రం ఉత్పత్తి వ్యయానికి, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసం ఉండడం, కొంతమంది బడా వ్యాపారుల చేతుల్లో వస్త్రవ్యాపారం బందీకావడం, గుత్తాధిపత్యం కోసం పథకం ప్రకారం చిన్న వ్యాపారులను దెబ్బతీయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారం మందగిస్తూ పలువురు వ్యాపారులు దివాళా తీస్తున్నారు. సిరిసిల్లలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా 34 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం, ఏడువేల మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఒక్కో మగ్గంపై నిత్యం వంద మీటర్ల పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి జరుగుతుంది. నిత్యం 27లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తి అవుతుంది. పాలిస్టర్ వస్త్రానికి వినియోగించే నూలు కిలో ధర రూ.102 ఉంది. ఇరవై రోజుల కిందట కిలో ధర రూ.92 ఉంది. ప్రతి కిలో నూలుకు రూ.10 ధర పెరగ్గా ఉత్పత్తి అయిన వస్త్రానికి ఆ మేరకు ధర పెరగడం లేదు. మీటరు పాలిస్టర్ వస్త్రాన్ని సిరిసిల్ల మగ్గాలపై ఉత్పత్తి చేసేందుకు రూ.7.30 ఖర్చు అవుతుంది. కానీ మీటరు వస్త్రానికి రూ.6.70 ధర లభిస్తుంది. ప్రతి మీటర్ వస్త్రంపై వ్యాపారులు 60పైసలు నష్టాలను చవిచూస్తున్నారు. బట్టకు ధరలేదని అమ్మడం ఆపేయడంతో సిరిసిల్లలో వస్త్రం నిల్వ లు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం సిరిసిల్లలో కోటి మీటర్ల వస్త్రం నిల్వలున్నాయి. సిరిసిల్లకు నూలు సరఫరా చేసే హైదరాబాద్ పెద్ద సేట్లే మళ్లీ వస్త్రం కొనుగోలు చేస్తున్నారు. సిరిసిల్లకు నూలు ఇవ్వడం, గుడ్డ కొనడం వారిచేతుల్లోనే ఉంది. దీంతో పెద్ద సేట్ల కనుసన్నల్లోనే సిరిసిల్ల వస్త్ర వ్యాపారం ఆధారపడి ఉంది. యాభై మంది హైదరాబాద్ సేట్లు సిరిసిల్లను గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. నిజానికి ఇతర ప్రాంతాల్లోనూ పాలిస్టర్ వస్త్రానికి ధర లేకపోవడంతో అనివార్యంగా సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు హైదరాబాద్ సేట్లకు బట్ట ఇవ్వాల్సి వస్తుంది. దీంతో నష్టాలను మూటగట్టుకుంటున్నారు. దివాళా తీసిన వ్యాపారులు సిరిసిల్లలో ఎంతో నమ్మకంగా వస్త్ర వ్యాపారం సాగిస్తున్న పలువురు వ్యాపారులు ప్రస్తుతం దివాళా తీసినట్లు చర్చసాగుతోంది. మంత్రి రవీందర్ వాట్సప్ మెసేజ్ ఉదంతంతో దివాళా వ్యాపారుల దైన్యస్థితి వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది మధ్య తరగతి వ్యాపారులు పాలిస్టర్ వ్యాపారం చేయలేక ఇబ్బం దులు పడుతున్నారు. సిరిసిల్లలో పెద్ద సేట్లుగా పేరున్న ఓ నలుగురు వ్యాపారులు చిన్న వ్యాపారులను పూర్తిగా ఇబ్బంది పెట్టేందుకు వస్త్రం ధరలను మరింత తగ్గించి, ఆసాములకు ఇచ్చే కూలిని తగ్గిస్తూ.. చిన్న వ్యాపారులను మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారనే ఆరోపణలున్నాయి. భవిష్యత్‌లో పోటీ లేకుండా చేసుకునే లక్ష్యంతో సిరిసిల్ల పెద్దసేట్లు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు సమాచారం. సిరిసిల్లలోని వ్యాపారులకు హైదరాబాద్ సేట్లు నూలు ఇవ్వకుండా అడ్డుపడుతూ అపనమ్మకాన్ని కలిగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ వ్యాపారులు సైతం గతంలో నూలు ఉద్దెర ఇస్తూ.. నెల రోజులకు డబ్బులు తీసుకునే వారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారం రోజుల్లో డబ్బులిస్తేనే నూలు ఇస్తాం... గుడ్డ అమ్మినా.. అమ్మకపోయినా డబ్బులిస్తామంటేనే పాలి స్టర్ నూలు ఇస్తామని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. దీంతో నష్టపోయిన సిరిసిల్ల వ్యాపారులు అప్పుల వేటలో పడగా కొత్తగా అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. గుడ్డ అమ్మక, నూలు నమ్మక వస్త్రవ్యాపారం సంక్షోభం ఉంది. ఇప్పటికిప్పుడు యాభై మంది వస్త్ర వ్యాపారులు నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో సిరిసిల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు కరువు పరిస్థితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం క్షీణించడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీని ప్రభావం సిరిసిల్లలోని ఇతర రంగాల్లోనూ ప్రబలంగా ఉంది. ప్రత్యామ్నాయం ఏమిటి..? ► సిరిసిల్లలో ఇప్పుడున్న మరమగ్గాలపై అనేక రకాల వస్త్రాలను ఉత్పత్తి చేయవచ్చు. ► మార్కెట్లో డిమాండ్ లేని పాలిస్టర్‌ను వదిలిపెట్టి, డిమాండ్ ఉన్న వస్త్రాలను ఉత్పత్తి చేయాలి. ► కొద్ది మంది వస్త్రవ్యాపారులు డిమాండ్ ఉన్న వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ.. సంక్షోభాలకు దూరంగా ఉంటూ ఆర్థికంగా స్థిరపడ్డారు. ► హైదరాబాద్‌లోని బడా సేట్లపై ఆధారపడకుండా సొంతగా బ్యాంకు రుణాలు పొంది పెట్టుబడులు సమకూర్చుకోవాలి. ► సిరిసిల్లలో ముద్రవంటి పథకాల్లో రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ► ఇప్పటికే కొద్ది మంది ప్రయోగాలను చేస్తూ నమ్మకమైన ఉపాధి పొందుతున్నారు. ► చేనేత, జౌళిశాఖ అధికారులను సంప్రదించి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న వస్త్ర వివరాలను సేకరించాలి. ► సిరిసిల్ల మరమగ్గాలపై పట్టు వస్త్రాలను ఉత్పత్తి చేసే నైపుణ్యం కార్మికుల్లో ఉంది. ► సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్‌ని సృష్టిస్తేనే ఆర్థిక సంక్షోభాలను అధిగమించవచ్చు. -
సిరిసిల్లలో మరమగ్గాలు బంద్
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని మరమగ్గాల యజమానులు సోమవారం నుంచి బంద్ ప్రకటించారు. వారం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని భావిస్తున్నారు. వస్త్ర నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోవటంతో మగ్గాలు నడపలేమంటూ ఈ మేరకు తీర్మానించారు. ఈ విషయమై ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, మగ్గాలు మూతబడటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. (సిరిసిల్ల) -
మూగబోయిన మగ్గం..
* సిరిసిల్లలో నేటి నుంచి సాంచాలు బంద్ * నష్టాల కారణంగా వస్త్రం ఉత్పత్తి నిలిపివేత * అమ్ముడుపోని వస్త్రం.. పేరుకుపోతున్న నిల్వలు * ధర పెట్టని దళారులు.. మీటర్‌కు 70 పైసలు నష్టం * ఆందోళనలో కార్మికులు.. వారం తర్వాత ప్రారంభిస్తామన్న యాజమాన్యాలు * సిరిసిల్లలో రోజూ ఉత్పత్తయ్యే పాలిస్టర్ వస్త్రం 27 లక్షల మీటర్లు * దీనిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు 15 వేల మంది * రోజుకు సగటున వస్తున్న నష్టం రూ.1.35 కోట్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మళ్లీ సంక్షోభంలో పడింది. దళారులు ధర తగ్గించేశారు.. కొనుగోళ్లూ మానేశారు.. ఉత్పత్తయిన వస్త్రం గుట్టలుగా పేరుకుపోతోంది.. ఈ నష్టాలు భరించలేక ఉత్పత్తిదారులు సాంచాలను నిలిపివేయాలని నిర్ణయించారు.. దీనిపైనే ఆధారపడిన కార్మికులంతా ఉపాధి కోల్పోనున్నారు. - సిరిసిల్ల వస్త్రాలు కొనని వ్యాపారులు సిరిసిల్లలో ఉత్పత్తయిన వస్త్రాన్ని కొనేందుకు నెల రోజులుగా హైదరాబాద్ వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దేశంలోనే అత్యధికంగా సిరిసిల్లలో మొత్తం 34 వేల మరమగ్గాలు ఉండగా.. 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తవుతోంది. ఒక్కో మగ్గంపై రోజూ దాదాపు వంద మీటర్ల వస్త్రం ఉత్పత్తవుతుంది. హైదరాబాద్ వ్యాపారులు దీనిని మీటరుకు రూ. 5.80 చొప్పున కొనుగోలు చేసేవారు. కానీ ఇటీవల ఆ వస్త్రం అమ్ముడుపోవడం లేదంటూ మీటర్‌కు రూ. 5.10 చొప్పున మాత్రమే చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితంగా ప్రతి మీటర్‌పై 70 పైసల నష్టాన్ని వస్త్రోత్పత్తిదారులు భరించాల్సి వస్తోంది. ఇలా నష్టానికి అమ్ముకోలేక వస్త్రాన్ని అమ్మకుండా ఉంచడంతో నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. దీంతో ఈ నిల్వలు తగ్గేవరకూ అసలు వస్త్రం ఉత్పత్తి చేయొద్దని సిరిసిల్ల పాలిస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయించింది. వారం రోజులపాటు సాంచాలు బంద్ పెట్టాలని వారు భావిస్తున్నారు. అంతా ఏజెంట్ల ఇష్టమే.. సిరిసిల్లలో తయారైన వస్త్రాన్ని హైదరాబాద్‌కు చెందిన 13 మంది కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేస్తారు. మార్కెట్ అవసరాలను బట్టి ధర నిర్ణరుుంచి వస్త్రం టాకాలను దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం ఏజెంట్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు తక్కువ ధరకే పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వారం పాటు నిలిపివేత! సిరిసిల్లలోని పాలిస్టర్ మరమగ్గాలను సోమవారం నుంచి బంద్ చేయాలని వస్త్రోత్పత్తిదారులు నిర్ణయించారు. వారం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని భావిస్తున్నారు. సాంచాల బంద్‌తో ఆసాములు, కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. అనివార్య పరిస్థితుల్లోనే సాంచాలు బంద్ పెడుతున్నామని యజ మానులు పేర్కొంటుండగా... ఈ నిర్ణయూన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నారుు. గత్యంతరం లేకే బంద్.. నెల రోజులుగా నష్టాలకే వస్త్రాన్ని అమ్ముకుంటున్నాం. నష్టాన్ని భరించడం కష్టంగా ఉంది. తక్కువ ధరకు వస్త్రాన్ని అమ్మడం ఇబ్బందిగా ఉండడంతో గత్యంతరం లేకే సాంచాలు బంద్ పెట్టాలని నిర్ణయించాం. వారం రోజులుగా ఆగితే మార్పు వస్తుందని భావిస్తున్నాం. ఆసాములు, కార్మికులు సహకరించాలి. - దూడం శంకర్, వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎప్పుడూ ఇదే బాధ.. ఏటా అన్‌సీజన్‌లో వస్త్రం ధర తగ్గడం సాధారణమే అరుునా... ఈసారి మార్చిలోనే పరిస్థితి దిగజారడం వస్త్రోత్పత్తిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కూలి రేట్లు పెరగడంతో ఒక్కో కార్మికుడికి రోజుకు రూ. 30 నుంచి రూ. 40 వరకు అదనంగా ఇస్తున్నారు. ఈ మేరకు వస్త్రానికి ధర పెరగకపోగా.. ధర ఇంకా తగ్గడంతో యజమానులు నష్టాల్లో మునిగిపోతున్నారు. పేరుకుపోయిన నిల్వలను అమ్ముకుని కొత్తగా ఉత్పత్తయ్యే వస్త్రాన్ని వారం తర్వాత డిమాండ్ ధరకు అమ్ముకోవాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వపరంగా వస్త్ర వ్యాపారంపై అజమారుుషీ లేకపోవడంతో ఈ పరిశ్రమ ఆటుపోట్ల మధ్య కొనసాగుతోంది. ఇటీవల కార్మికులకు పెంచిన కూలి మూలంగా నష్టాలు వస్తున్నాయన్న నెపంతో యజమానులు బంద్ పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఖాళీగా ఉండుడే.. ఐదేళ్లుగా పాలిస్టర్ సాంచాలు నడుపుతున్నాం. సాంచాలు బంద్ పడితే ఖాళీగా ఉండుడే. నేను ఎనిమిది సాంచాలు నడుపుతాను. రోజుకు 12 గంటలు పనిచేస్తే నెలకు రూ. ఆరు వేల దాకా వస్తాయి. - పోరండ్ల రాజ్‌కుమార్, పవర్‌లూం కార్మికుడు మరో పని రాదు సిరిసిల్లలో పదిహేనేళ్లుగా సాంచాలు నడుపుతున్న. నా భార్య బీడీలు చేస్తుంది. సాంచాలు బంద్ పడితే ఇల్లు నడపడం కష్టమే. పెంచిన కూలిని మొన్నట్నుంచే ఇస్తుండ్రు. రోజుకు రూ. 40 పెరిగినయి. మరో పనిరాదు ఏంజెస్తం.. - దొంతు హన్మంతు, కార్మికుడు -
సాంచాల మధ్య సావుకేక
కొనసాగుతున్న పాలిస్టర్ పవర్‌లూమ్స్ సమ్మె ఆర్థిక ఇబ్బందుల్లో నేత కార్మికులు ఐదు రోజుల్లో ముగ్గురి ఆత్మహత్య సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మళ్లీ చావుకేకలు వినిపిస్తున్నాయి. ఐదురోజుల వ్యవధిలో ముగ్గురు నేతన్నలు ఉరివేసుకున్నారు. మంత్రి కె. తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కులవృత్తిని నమ్ముకున్న నేతన్నలు బతకలేక బతుకు చాలిస్తున్నారు. పాలిస్టర్ పవర్‌లూమ్స్ సమ్మెతో వారి జీవనం మరింత దిగజారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 78 వేల మరమగ్గాలుండగా, ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 27 వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. పాతికవేల మంది కార్మికులు వస్త్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. రెండేళ్లకోసారి వస్త్ర పరిశ్రమలో కూలి ఒప్పందం జరగడం ఆనవాయితీ. డిసెంబర్ 15తోనే కూలి ఒప్పందం ముగిసింది. కొత్త కూలి ఒప్పందం కోసం ఆసాములు, కార్మికులు డిసెంబర్ 30 నుంచి సమ్మె చేస్తుండగా, వేలాది మంది కార్మికులు చేతిలో పని లేక ఖాళీగా ఉంటున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ కుటుంబాల్లో కొన్ని పస్తులుంటుండగా, చేతిలో చిల్లిగవ్వ లేక నేత కార్మికులు ఆత్మహత్యల బలిపీఠం ఎక్కుతున్నారు. సాంచాల సాక్షిగా... సిరిసిల్ల గణేశ్‌నగర్‌కు చెందిన సామల గౌరయ్య(52) ఎనిమిది సాంచాలకు యజమాని. మరో నేత కార్మికునికి ఉపాధి కల్పిస్తూ, తాను బట్ట నేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డిసెంబర్ 30 నుంచి పాలిస్టర్ పవర్‌లూమ్స్ సమ్మె ప్రారంభమైంది. అప్పటినుంచి గౌరయ్య చేతికి పనిలేదు. ఏడాదిన్నర కిందట కూతురు శిరీష పెళ్లికి చేసిన అప్పులు రూ. 4 లక్షల వరకు ఉన్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేక మానసిక వేదనకు గురయ్యాడు. ఇంట్లోనే నూలుపోగులతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తిపాక వీధికి చెందిన బల్ల నర్సింహులు(58) నేత కార్మికుడు. సాంచాలు నడిపితే వచ్చే కూలితోనే ఇల్లు గడుస్తుంది. భార్య లక్ష్మి బీడీలు చుడితే నెలకు రూ. వెయ్యి వరకు వస్తుంది. నర్సింహులు వారం రోజులు సాంచాలు నడిపితే రూ.1,200 వచ్చేవి. ఏడాది కిందటే కూతురు దివ్యభారతి పెళ్లి చేశాడు. రూ. 3లక్షల వరకు అప్పులయ్యాయి. సమ్మె కారణంగా పని లేకపోవడంతో నర్సింహులు మానసిక వేదనకు గురయ్యాడు. ఈనెల 3న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడా కుటుంబం కర్మకాండ చేసేందుకు సైతం చేతిలో డబ్బుల్లేక తడారని కళ్లతో దీనంగా చూస్తోంది. గణేశ్‌నగర్‌కు చెందిన మిట్టపల్లి శ్రీధర్(26) తండ్రి రాజేశం నేత కార్మికుడు. తల్లి లక్ష్మి బీడీ కార్మికురాలు. సాంచాల బంద్‌తో రాజేశం మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. శ్రీధర్, లక్ష్మి గుర్తించి రాజేశం తాడు తొలగించి ఆస్పత్రికి తరలించారు. తండ్రి రాజేశం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి డబ్బుల్లేవు. ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఈనెల 5న కొడుకు శ్రీధర్ ఇంట్లో ఉరివేసుకొని తనువు చాలించాడు. ప్రభుత్వ విధానం కరువు.. సిరిసిల్లలో ప్రైవేటు రంగంలో కొనసాగుతున్న వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వ అజమాయిషీ కరువైంది. కూలి పెంపుపై నిర్దిష్ట విధానం లేకపోవడంతో రెండేళ్లకోసారి కూలి పోరు.. సమ్మెలు అనివార్యమయ్యాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కె.తారకరామారావు చొరవ చూపితే కూలి ఒప్పందంపై ఏకాభిప్రాయం సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విధానపరమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పరంగా కార్మికులకు దీర్ఘకాలిక మేలు జరిగే సంస్కరణలు తీసుకొస్తే నేత కార్మికుల బతుకునకు భరోసా లభిస్తుందని ఆశిస్తున్నారు. చేనేత జౌళి శాఖ, కార్మిక, పరిశ్రమల శాఖల అధికారుల పర్యవేక్షణలో కూలీలకు వేజ్‌బోర్డు ఏర్పాటు చేసి నిర్దిష్ట వేతనాలు లభించే విధంగా చర్యలు తీసుకుంటే సిరిసిల్లలో ఆకలిచావులు, ఆత్మహత్యలు నివారించినట్లవుతుంది, మరోవైపు గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం వర్తింపజేస్తే కార్మికలోకానికి శాశ్వత ఉపాధిమార్గం దరిచేరుతుంది. మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండగా, 2012లో జరిగిన కూలి ఒప్పంద చర్చల్లో స్వయంగా పాల్గొన్నారు. ఈసారీ మంత్రి కేటీఆర్ చొరవ చూపితే ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల కార్మిక జీవితాల్లో సిరి వెలుగులు పండుతాయి.