సాంచాల మధ్య సావుకేక | Sanchi between the savukeka | Sakshi
Sakshi News home page

సాంచాల మధ్య సావుకేక

Published Thu, Jan 8 2015 3:19 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

సాంచాల మధ్య సావుకేక - Sakshi

సాంచాల మధ్య సావుకేక

  • కొనసాగుతున్న పాలిస్టర్ పవర్‌లూమ్స్ సమ్మె
  • ఆర్థిక ఇబ్బందుల్లో నేత కార్మికులు
  • ఐదు రోజుల్లో ముగ్గురి ఆత్మహత్య
  • సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మళ్లీ చావుకేకలు వినిపిస్తున్నాయి. ఐదురోజుల వ్యవధిలో ముగ్గురు నేతన్నలు ఉరివేసుకున్నారు. మంత్రి కె. తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కులవృత్తిని నమ్ముకున్న నేతన్నలు బతకలేక బతుకు చాలిస్తున్నారు. పాలిస్టర్ పవర్‌లూమ్స్ సమ్మెతో వారి జీవనం మరింత దిగజారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 78 వేల మరమగ్గాలుండగా, ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలున్నాయి.

    ఇందులో 27 వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. పాతికవేల మంది కార్మికులు వస్త్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. రెండేళ్లకోసారి వస్త్ర పరిశ్రమలో కూలి ఒప్పందం జరగడం ఆనవాయితీ. డిసెంబర్ 15తోనే కూలి ఒప్పందం ముగిసింది. కొత్త కూలి ఒప్పందం కోసం ఆసాములు, కార్మికులు డిసెంబర్ 30 నుంచి సమ్మె చేస్తుండగా, వేలాది మంది కార్మికులు చేతిలో పని లేక ఖాళీగా ఉంటున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ కుటుంబాల్లో కొన్ని పస్తులుంటుండగా, చేతిలో చిల్లిగవ్వ లేక నేత కార్మికులు ఆత్మహత్యల బలిపీఠం ఎక్కుతున్నారు.
     
    సాంచాల సాక్షిగా...

    సిరిసిల్ల గణేశ్‌నగర్‌కు చెందిన సామల గౌరయ్య(52) ఎనిమిది సాంచాలకు యజమాని. మరో నేత కార్మికునికి ఉపాధి కల్పిస్తూ, తాను బట్ట నేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డిసెంబర్ 30 నుంచి పాలిస్టర్ పవర్‌లూమ్స్ సమ్మె ప్రారంభమైంది. అప్పటినుంచి గౌరయ్య చేతికి పనిలేదు. ఏడాదిన్నర కిందట కూతురు శిరీష పెళ్లికి చేసిన అప్పులు రూ. 4 లక్షల వరకు ఉన్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేక మానసిక వేదనకు గురయ్యాడు. ఇంట్లోనే నూలుపోగులతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తిపాక వీధికి చెందిన బల్ల నర్సింహులు(58) నేత కార్మికుడు. సాంచాలు నడిపితే వచ్చే కూలితోనే ఇల్లు గడుస్తుంది. భార్య లక్ష్మి బీడీలు చుడితే నెలకు రూ. వెయ్యి వరకు వస్తుంది. నర్సింహులు వారం రోజులు సాంచాలు నడిపితే రూ.1,200 వచ్చేవి.
     
    ఏడాది కిందటే కూతురు దివ్యభారతి పెళ్లి చేశాడు. రూ. 3లక్షల వరకు అప్పులయ్యాయి. సమ్మె కారణంగా పని లేకపోవడంతో నర్సింహులు మానసిక వేదనకు గురయ్యాడు. ఈనెల 3న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడా కుటుంబం కర్మకాండ చేసేందుకు సైతం చేతిలో డబ్బుల్లేక తడారని కళ్లతో దీనంగా చూస్తోంది.

    గణేశ్‌నగర్‌కు చెందిన మిట్టపల్లి శ్రీధర్(26) తండ్రి రాజేశం నేత కార్మికుడు. తల్లి లక్ష్మి బీడీ కార్మికురాలు. సాంచాల బంద్‌తో రాజేశం మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. శ్రీధర్, లక్ష్మి గుర్తించి రాజేశం తాడు తొలగించి ఆస్పత్రికి తరలించారు. తండ్రి రాజేశం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి డబ్బుల్లేవు. ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఈనెల 5న కొడుకు శ్రీధర్ ఇంట్లో ఉరివేసుకొని తనువు చాలించాడు.   
     
    ప్రభుత్వ విధానం కరువు..

    సిరిసిల్లలో ప్రైవేటు రంగంలో కొనసాగుతున్న వస్త్ర పరిశ్రమపై ప్రభుత్వ అజమాయిషీ కరువైంది. కూలి పెంపుపై నిర్దిష్ట విధానం లేకపోవడంతో రెండేళ్లకోసారి కూలి పోరు.. సమ్మెలు అనివార్యమయ్యాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కె.తారకరామారావు చొరవ చూపితే కూలి ఒప్పందంపై ఏకాభిప్రాయం సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విధానపరమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పరంగా కార్మికులకు దీర్ఘకాలిక మేలు జరిగే సంస్కరణలు తీసుకొస్తే నేత కార్మికుల బతుకునకు భరోసా లభిస్తుందని ఆశిస్తున్నారు.  

    చేనేత జౌళి శాఖ, కార్మిక, పరిశ్రమల శాఖల అధికారుల పర్యవేక్షణలో కూలీలకు వేజ్‌బోర్డు ఏర్పాటు చేసి నిర్దిష్ట వేతనాలు లభించే విధంగా చర్యలు తీసుకుంటే సిరిసిల్లలో ఆకలిచావులు, ఆత్మహత్యలు నివారించినట్లవుతుంది, మరోవైపు గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం వర్తింపజేస్తే కార్మికలోకానికి శాశ్వత ఉపాధిమార్గం దరిచేరుతుంది. మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండగా, 2012లో జరిగిన కూలి ఒప్పంద చర్చల్లో స్వయంగా పాల్గొన్నారు. ఈసారీ మంత్రి కేటీఆర్ చొరవ చూపితే ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల కార్మిక జీవితాల్లో సిరి వెలుగులు పండుతాయి.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement